పాక్‌లో రైలు హైజాక్‌ | Pakistan train hijack: Baloch militants kill 30 soldiers and take 215 hostages after firing at Jaffar Express | Sakshi
Sakshi News home page

పాక్‌లో రైలు హైజాక్‌

Published Wed, Mar 12 2025 4:39 AM | Last Updated on Wed, Mar 12 2025 4:40 AM

Pakistan train hijack: Baloch militants kill 30 soldiers and take 215 hostages after firing at Jaffar Express

బలూచీ వేర్పాటువాదుల దుశ్చర్య 

30 మంది కాల్చివేత, బందీలుగా 215 మంది

మృతులు, బందీల్లో అత్యధికులు సైనికులే.. సైనిక చర్యకు దిగితే వారందరినీ చంపేస్తాం 

పాక్‌ ప్రభుత్వానికి బీఎల్‌ఏ హెచ్చరికలు.. తమ నేతల విడుదలకు డిమాండ్‌ 

షహబాజ్‌ షరీఫ్‌ సర్కారుకు 48 గంటల డెడ్‌లైన్‌..

కరాచీ/ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో బలూచీ వేర్పాటువాదులు ఘోరానికి తెగబడ్డారు. మంగళవారం బలూచిస్తాన్‌ ప్రావిన్సులో ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్‌ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. ‘‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’’ అని పేర్కొంది. దీనిపై పాక్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.

ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్‌ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్‌ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది.

బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్‌ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్‌ నక్వీ ప్రకటించారు. కడపటి వార్తలు అందే సమయానికి బీఎల్‌ఏ సాయుధులపై పాక్‌ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగినట్టు సమాచారం.

బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నాయి. బలూచిస్తాన్‌ ప్రావిన్సు అఫ్గానిస్తాన్, ఇరాన్‌ సరిహద్దుల్లో ఉంటుంది. పాక్‌ నుంచి స్వాతంత్య్రం కోసం పలు స్థానిక తెగలతో కూడిన వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. వాటిలో బీఎల్‌ఏ అతి పెద్దది. దానిపై పాక్‌తో పాటు అమెరికా, బ్రిటన్లలో కూడా నిషేధముంది.

ఇలా జరిగింది
దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్‌ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్‌ టన్నెల్‌ సమీపంలో బీఎల్‌ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్‌ఏ సాయుధులు తమ అదీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించినట్టు సమాచారం. ‘‘ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్‌ఐకు, సైన్యానికి చెందినవారే.

వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు’’అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్‌ఏలోని మజీద్‌ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్‌ టాక్టికల్‌ ఆపరేషన్స్‌ స్క్వాడ్, ఫతే స్క్వాడ్‌ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్‌ఏ ప్రకటించింది.

ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, పౌరులను వదిలేసినట్టు ప్రకటించింది. బీఎల్‌ఏ దాడుల నేపథ్యంలో క్వెట్టా, పెషావర్‌ మధ్య రైలు సేవలను కొంతకాలం నిలిపేశారు. గత అక్టోబర్‌లోనే పునరుద్ధరించారు. తర్వాత నెల రోజులకే క్వెట్టా రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించారు. బలూచీల దాడి ముప్పు నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లన్నీ పటిష్టమైన సాయుధ భద్రత నడుమ ప్రయాణిస్తుంటాయి. భారీ దాడికి బీఎల్‌ఏ పథక రచన చేస్తోందని కౌంటర్‌ టెర్రరిజం విభాగం గత మంగళవారమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement