‘వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా క్షేమం’

Over 3000 Vaccinated Against Coronavirus In Moscow - Sakshi

మాస్కో : కరోనా వైరస్‌ నియంత్రణకు రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సమాంతరంగా మూడో దశ పరీక్షలను పెద్దఎత్తున చేపట్టారు. మాస్కోలో 3000 మందికి పైగా వాలంటీర్లకు ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ ఇవ్వగా వారిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని రష్యా మీడియా సోమవారం వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యం బాగా ఉందని మాస్కో మేయర్‌ సెర్జీ సోబ్యనిన్‌ పేర్కొన్నారు. తాను చాల నెలల కిందటే వ్యాక్సిన్‌ వేయించుకున్నానని, తనకేమీ కాలేదని చెప్పుకొచ్చారు. మాస్కోలో కరోనా వ్యాక్సిన్‌ పరీక్షల్లో పాల్గొనేందుకు 60,000 మందికి పైగా వాలంటీర్లు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా సైంటిఫిక్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ సిద్ధమైందని ఆగస్ట్‌ 11న రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా వ్యాక్సిన్‌పై భారత్‌లో మానవ పరీక్షలు, సరఫరాల కోసం ఆర్‌డీఐఎఫ్‌, రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. పరీక్షలు విజయవంతమై సంబంధిత అనుమతులు లభిస్తే ఏడాది చివరినాటికి భారత్‌లో వ్యాక్సిన్‌ సరఫరాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. భారత్‌లో రెగ్యులేటరీ అనుమతులు లభించిన వెంటనే డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌కు ఆర్‌డీఐఎఫ్‌ 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయనుంది. చదవండి : తీపికబురు : మార్కెట్‌లోకి రష్యా వ్యాక్సిన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top