తొలి ప్రసంగంలో కమల ఏం చెప్పారంటే..!

Kamala Harris Mention Her Parents Roots In US Election First Speech - Sakshi

ఉపాధ్యక్ష రేసులో కమల: మొదటి ప్రసంగం

వాషింగ్టన్‌: ‘‘నీ చుట్టూ ఉన్న సమస్యల గురించి ఊరికే ఫిర్యాదు చేయడం మానేసెయ్‌. వాటిని పరిష్కరించేందుకు నీ వంతు ప్రయత్నంగా ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’అంటూ కమలా హారిస్‌ తన తల్లి శ్యామలా గోపాలన్‌ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన తన తల్లిదండ్రులు అమెరికాలో పౌరహక్కుల ఉద్యమంలో పాలుపంచుకున్నారని, న్యాయం కోసం గొంతెత్తి నినదించారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో తాను సైతం బాధితుల పక్షాన నిలబడి 30 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో ఉన్న జో బిడెన్‌ మంగళవారం.. కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. (కమలా ఎంపికకి కారణాలివే !)

ఈ నేపథ్యంలో జో బిడెన్‌తో కలిసి బుధవారం తొలిసారిగా డెలావర్‌లోని విల్మింగ్‌టన్‌లో మీడియా ఎదుటకు వచ్చిన కమల తొలి ప్రసంగంలోనే తన భారత- ఆఫ్రిక మూలాల గురించి ప్రస్తావిస్తూ ఇండో- అమెరికన్లు, శ్వేత జాతీయేతరులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ మీ అందరికీ తెలుసు. ప్రపంచస్థాయి అత్యున్నత విద్యను అభ్యసించే క్రమంలో నా తల్లిదండ్రులు ప్రపంచంలోని వేర్వేరు దేశాల నుంచి ఇక్కడకు వచ్చారు. మా అమ్మ ఇండియా నుంచి, మా నాన్న జమైకా నుంచి అమెరికాకు వచ్చారు.

1960లో జరిగిన పౌరహక్కుల ఉద్యమం వారిని కలిపింది. విద్యార్థి దశలో ఓక్లాండ్‌ వీధుల్లో న్యాయం కోసం పోరాటం చేస్తూ నినాదాలు చేశారు. తర్వాత నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేశారు. వాళ్లతో పాటు నన్నూ తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా మా అమ్మ శ్యామలా గోపాలన్‌ నన్ను, నా సోదరి మాయా హారిస్‌ను సొంత నిర్ణయాలు తీసుకునేలా, న్యాయం కోసం నిలబడేలా పెంచారు. సమస్యల గురించి గొంతెత్తేలా ఆత్మవిశ్వాసం నింపారు. తను చెప్పిన ప్రతి మాటను ఆచరించాను. (అగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!)

నా జీవితాంతం సమానత్వం కోసం పోరాడతానని 30 ఏళ్ల క్రితం అమెరికా సుప్రీంకోర్టులో నేను చెప్పిన మాటలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. కమలా హారిస్‌ ఉన్నది ప్రజల కోసమే. అందుకు అనుగుణంగానే నేటికీ ప్రజల తరఫునే నిలబడ్డాను. డిస్ట్రిక్ట్‌ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధితుల కోసం వాదించాను. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకున్నాను. సెనెటర్‌గా ప్రతీ రోజూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డాను. అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన పాలనా యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండేలా గళమెత్తాను.

ఇప్పుడు శ్వేతసౌధంలోకి వెళ్లిన తర్వాత నేను, జో అదే పంథాను కొనసాగిస్తాం. ప్రజల కోసమే పాటుపడతాం’’ అని చెప్పుకొచ్చారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి అమెరికన్లకు చెప్పాలనుకుంటునానన్న కమలా హారిస్‌.. ‘‘నా భర్త డగ్‌, మాకు రత్నాల్లాంటి పిల్లలు కోల్‌, ఎలా ఉన్నారు’’అని తెలిపారు. కాగా కమల తన సహచర లాయర్‌ డగ్లస్‌ ఎమాఫ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లే ఎలా, కోల్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top