ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి ట్రంప్‌

Donald Trump Still Infectious Back At White House Without Mask - Sakshi

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాటకీయ ఫక్కీలో తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలిన తర్వాత మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు అసాధారణ రీతిలో వైద్య చికిత్సలు పొందిన ఆయన సోమవారం రాత్రి తిరిగి అధ్యక్ష భవనానికి వచ్చారు. కరోనాను చూసి భయపడటం లేదంటూ, మాస్క్‌ తీసేసిన ట్రంప్‌పై పలువురు మండిపడుతున్నారు. తనతోపాటు భార్య మెలానియా, శ్వేతసౌధంలోని పలువురు సిబ్బంది అనారోగ్యం బారిన పడినా కోవిడ్‌ పట్ల తన మొండివైఖరిని మార్చుకోకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌ ఉత్సాహంగా ఫిట్‌గా ఉన్నట్లు చూపడానికి..మాస్కు తీసేసి ఎలివేటర్‌కు బదులుగా పోర్టికో మెట్లద్వారా బాల్కనీకి చేరుకున్నారు.   (గాలి ద్వారా కరోనా వ్యాప్తి)

అక్కడి నుంచి వెళ్లిపోతున్న మెరైన్‌ ఒన్‌ హెలికాప్టర్‌కు సెల్యూట్‌ చేశారు. అనంతరం ట్విట్టర్లో ఆయన..‘2.10 లక్షల మంది ప్రజలు చనిపోయినా భయపడాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రత్యర్థి బైడెన్‌తో ఈనెల 15వ తేదీన మియామీలో జరగనున్న డిబేట్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా’అని తెలిపారు. ‘నేనే ముందుంటా. నాయకత్వం వహిస్తా. నేను చేసినట్లుగా ఏ నాయకుడూ చేయలేడు. రిస్క్‌ ఉందని నాకు తెలుసు. అయినా సరే. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నా. నాకు నిరోధకత ఉండి ఉండొచ్చు’అని పేర్కొన్నారు. అంతకుముందు, వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ సెంటర్‌ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్‌ మాస్కు ధరించి ఒంటరిగా బయటకు వచ్చారు.

‘చాలా బాగున్నా’అంటూ రెండు చేతుల బొటనవేళ్లు పైకెత్తి చూపుతూ హెలికాప్టర్‌ ఎక్కారు. ఎన్నికలకు ఇంకా నెల మాత్రమే సమయం మిగిలి ఉండగా, మిలిటరీ ఆస్పత్రి నుంచి ట్రంప్‌..‘త్వరలోనే ప్రచార కార్యక్రమంలో తిరిగి పాల్గొంటా’అంటూ వీడియో పోస్ట్‌ చేశారు. ‘భయపడకండి. మీరు కరోనాను జయిస్తారు. మనకు ఉత్తమ పరికరాలు, ఔషధాలు ఉన్నాయి’అని పేర్కొన్నారు.  మునుపటి ఉత్సాహం ఆయన గొంతులో కనిపించలేదు. ఎక్కువగా శ్వాస తీసుకున్నట్లు కనిపించిందని పరిశీలకులు అంటున్నారు.
 
ట్రంప్‌ రేసిస్ట్‌: మిషెల్‌ ఒబామా: జాతిదురహంకారి అయిన ట్రంప్, అధ్యక్ష పదవికి అర్హుడు కాదు అని మాజీ ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా అన్నారు. దేశం తిరిగి స్థిరత్వం సాధించటానికి అర్హుడైన వ్యక్తినే ఎంచుకోవాలని ప్రజలను ఈ సందర్భంగా మిషెల్‌ కోరారు. (ఆస్పత్రి బయట ట్రంప్‌ చక్కర్లు)

ఆయన పూర్తిగా కోలుకోలేదు 
కోవిడ్‌ నుంచి ట్రంప్‌ పూర్తిగా కోలుకోలేదనీ, ఇందుకు మరో వారం పడుతుందని ట్రంప్‌ వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కాన్లే చెప్పారు. అప్పటి వరకు ఆయన వైట్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటారన్నారు. మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స సమయంలో ట్రంప్‌కు వైద్యులు నాలుగో డోసు రెమిడెసివిర్‌ ఇచ్చారు. ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే కోవిడ్‌ బారిన పడిన వ్యక్తులు కనీసం 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిపుణులు చెబుతుండటం గమనార్హం. 

వైట్‌హౌస్‌లో భయం
శత్రుదుర్భేద్యమైన శ్వేత సౌధం ఇప్పుడు కరోనా వార్డుగా మారిపోయింది. దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పటి నుంచో వైరస్‌ని తేలిగ్గా కొట్టి పారేసినా ఇప్పుడు ఆయనే కరోనా బారినపడి వైద్యం పొందుతున్నారు. కోవిడ్‌ నయం కాకుండానే ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ట్రంప్‌ ఐసోలేషన్‌ నియమాలను పాటించకపోవడంతో సిబ్బంది భయ భ్రాంతులకు గురౌతున్నారు. ఈ వారంలో వైట్‌హౌస్‌లో డజనుకిపైగా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం వైట్‌ హౌస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. వైట్‌ హౌస్‌లో పనిచేసే చాలా మంది సిబ్బంది ఒకప్పుడు వైట్‌ హౌస్‌ని సురక్షిత ప్రాంతంగా భావించేవారు. కానీ, అధ్యక్షుని ఆరోగ్యంపై విడుదలవుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన సిబ్బంది భయపడుతున్నారు. సీక్రెట్‌ సర్వీసెస్‌ సిబ్బందిలో ఎంత మందికి కరోనా వైరస్‌ సోకిందనే విషయాన్ని చెప్పడానికి వారు నిరాకరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top