కరోనాను బయట పెట్టిన జర్నలిస్ట్‌కు జైలు

Chinese Citizen Journalist Jailed  For Wuhan Virus Reporting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు చైనాలోని ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరోలోజీ’ కారణమని ఆరోపించడమే కాకుండా, వైరస్‌ బారిన పడిన చైనా ప్రజలకు సరైనా వైద్యాన్ని అందించడం లేదంటూ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీసిన సిటిజెన్‌–జర్నలిస్ట్‌ (ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌) జాంగ్‌ జాన్‌ (37)కు చైనా కోర్టు సోమవారం నాడు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. తన భావ ప్రకటనా స్వేచ్ఛను కోర్టు తీర్పు హరిస్తోందని, దీనిపై తాను పైకోర్టులో అప్పీల్‌ చేస్తానని మాజీ న్యాయవాది అయిన జాంగ్‌ జాన్‌ మీడియాకు వెల్లడించారు. (చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్‌..!)

న్యాయవాది వృత్తిని వదిలేసి ఫ్రీలాన్స్‌ జర్నలిజంలోకి వచ్చిన జాంగ్‌ డిసెంబర్‌ మొదట్లోనే ప్రాణాంతక వైరస్‌ గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఆ వైరస్‌ బారిన పడిన ప్రజలు చనిపోతున్నా చైనా అధికార యంత్రాంగం నోరు పెదమడం లేదని, వైరస్‌ గురించి వార్తలను వెలుగులోకి రాకుండా వైద్యుల నోళ్లకు తాళాలు వేసిందంటూ జాంగ్‌ తన బ్లాగ్‌ ద్వారా, వీడియోలో యూట్యూబ్‌లో అపలోడ్‌ చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేశారు. వైరస్ బారిన పడిన రోగులను, వైద్యులను, ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వీడియోలు తీసి ప్రపంచ మీడియాకు పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 

కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలో ఆవిర్భవించడానికి ‘వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరోలోజీ’ సంస్థయే కారణమంటూ ఆమె తన స్వతంత్య్ర మీడియా ద్వారా వాదించారు. వుహాన్‌ నగరంలోనే కరోనా వైరస్‌ ఆవిర్భవించడం, వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు చైనా అధికారులు అన్ని విధాల ప్రయత్నించారని, అంతుకు మించిన  సాక్ష్యాలు ఏమీకావాలంటూ ఆమె వాదించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆమె తన వార్తల పరంపరను కొనసాగించడంతో ఆమెపై చైనా పోలీసులు కేసు పెట్టి గత మే నెలలో అరెస్ట్‌ చేశారు. తనపై తక్షణమే విచారణ చేపట్టకుండా జైల్లో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె గత జూన్‌ నెలలో జైల్లోనే నిరాహార దీక్ష చేశారు. జైలు అధికారులు బలవంతంగా ఆమెకు పైపుల ద్వారా లిక్విడ్‌ ఫుడ్‌ను అందించారని కూడా ఆమె కోర్టు ముందు ఆరోపించారు. (ఎంత కాలంలో కరోనా ఖతం...?)

ఆమెను అరెస్ట్‌ చేసిన దాదాపు ఏడు నెలల తర్వాత ‘షాంఘై పుడాంగ్‌ న్యూడిస్ట్రిక్ట్‌ పీపుల్స్‌ కోర్ట్‌’లో విచారణ ప్రారంభమైంది. ఆమెను అరెస్ట్‌ చేయడం అంటే ఆమె భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనంటూ ఆమె తరఫు న్యాయవాది చేసిన వాదనను ఖండిస్తూ, ఆమె తప్పుడు ప్రచారాన్ని సాగించారని, తద్వారా ప్రభుత్వం పరవుతీసేందుకు, ప్రజలను పక్కదారి పట్టించారంటూ ప్రాసిక్యూటర్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆమెను విడుదల చేయాలంటూ ప్లకార్డులతో కోర్టు ముందకు వచ్చిన సామాజిక కార్యకర్తలు, తోటి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు హతాశులయ్యారు. విదేశీ జర్నలిస్టులను కోర్టు ముందుకు అనుమతించలేదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top