చైనా వ్యాక్సిన్‌ వేసుకుంటేనే..

China Says Will Issue Visa To Foreigners If They Take Chinese Vaccine - Sakshi

బీజింగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టే క్రమంలో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభించాయి. భారత్‌, చైనా సహా ఇతర దేశాలు దేశీయంగా తయారైన టీకాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న డోసుల వినియోగానికి సమ్మతి తెలపడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు కోవిడ్‌-19 భయం నుంచి కోలుకుంటున్నారు. కాగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకై అంతర్జాతీయ ప్రయాణాలపై గత కొన్ని నెలలుగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా సరికొత్త ప్రతిపాదనలతో విదేశీయులకు వీసా మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. 

తమ దేశంలో తయారైన కోవిడ్‌ టీకాను తీసుకున్న వారికి వీసా ఇస్తామని తెలిపింది. వ్యాపార లావాదేవీలు, తమ దేశంలో చిక్కుకుపోయిన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, ఇతరత్రా కారణాలతో చైనాను సందర్శించాలనుకునే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికాలోని చైనీస్‌ రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఒక షాట్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు దేశంలో అడుగుపెట్టిన తర్వాత మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 

భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పైన్స్‌, ఇటలీ, శ్రీలంక తదితర దేశాల్లోని చైనా ఎంబసీలు కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేశాయి. కాగా చైనాలోని వుహాన్‌లో తొలుత కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో డ్రాగన్‌ దేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చైనీయుల ఆహరపుటలవాట్ల వల్లే వైరస్‌ వ్యాప్తి చెందిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా ఇతర దేశాధినేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో చైనాలో తయారైన వ్యాక్సిన్ల వినియోగం పట్ల కూడా చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. డ్రాగన్‌ దేశం తయారు చేసిన టీ​​కాలు ప్రభావంతంగా పనిచేస్తాయా లేదా అని సందేహాలు వ్యక్తం చేశాయి. 

ఈ క్రమంలో, తాజా ప్రకటన నేపథ్యంలో  చైనా తమ వ్యాక్సిన్లను ఈ విధంగా మార్కెటింగ్‌ చేసుకోవాలని చూస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా రూపు మార్చుకుని ప్రబలుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఇక ఇప్పటివరకు దేశీయంగా తయారు చేసిన నాలుగు వాక్సిన్ల ఉపయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చైనా, దేశ వ్యాప్తంగా వాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది. 

చదవండి: ఇదీ అమెరికాపై కోవిడ్‌ రాసిన విషాద గీతిక!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top