లోన్‌ తీసుకుని లూటీ చేశారు! | - | Sakshi
Sakshi News home page

లోన్‌ తీసుకుని లూటీ చేశారు!

Sep 18 2025 10:36 AM | Updated on Sep 18 2025 10:36 AM

లోన్‌ తీసుకుని లూటీ చేశారు!

లోన్‌ తీసుకుని లూటీ చేశారు!

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. బాధితులు ఊహించని, వారి ఊహకు అందని విధంగా పంజా విసురుతున్నారు. సెల్‌ఫోన్లలోని ఏపీకే ఫైల్స్‌ పంపి, వారి ఖాతాలకు ఖాళీ చేస్తున్న నేరాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే బాధితుల నెట్‌ బ్యాంకింగ్‌ను వాడి, వారి ప్రయేయం లేకుండానే వారి పేరుతో రుణం తీసుకుని, ఖాతాలో పడిన తర్వాత, సేవింగ్స్‌తో కలిపి కాజేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఈ పంథాలో రూ.12.75 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్‌ వ్యక్తి ఈ నెల 2న సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. తాజాగా రూ.13 లక్షలు కోల్పోయిన మరో బాధితుడు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన బాధితుడి (45) ఫోన్‌కు సైబర్‌ నేరగాళ్లు ఇటీవల ‘ఈ చలాన్‌ ఆర్టీఓ.ఏపీకే’ పేరుతో ఉన్న లింకు పంపారు. దీనిపై అవగాహన లేని ఆ బాధితుడు అది ఈ–చలాన్లకు సంబంధించిన యాప్‌ అని భావించి క్లిక్‌ చేశారు. ఆ వెంటనే అందులో ఉన్న ఏపీకే ఫైల్‌ బాధితుడి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోయింది. ఇలా బాధితుడి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఆయనకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా నెట్‌ బ్యాంకింగ్‌ను యాక్సస్‌ చేశారు. ‘పే యూ మనప్పుడు ఫిన్‌’ పేరుతో ఉన్న వారి ఖాతాను బెనిఫిషియరీ అకౌంట్‌గా యాడ్‌ చేసుకున్నారు. లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు సైతం నేరగాళ్లు చూడగలగటంతో బాధితుడి నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానే రూ.12.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం మంజూరై బాధితుడి ఖాతాలో పడింది. దీంతో పాటు అప్పటికే ఖాతాలో ఉన్న సేవింగ్స్‌ రూ.50 వేలు కలిపి మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు వరుసపెట్టి అందుకున్న బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. అతడి ఫోన్‌ అధ్యయనం చేసిన అధికారులు ఈ ఏపీకే ఫైల్‌తో కూడిన యాప్‌ గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏపీకే ఫైల్‌ ద్వారా కథనడిపిన కేటుగాళ్లు

బాధితుడి ప్రమేయం లేకుండానే రుణం

మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement