
నాలాలపై ఆక్రమణలు తొలగించాలి
నాంపల్లి: భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం వరదలో కొట్టుకుపోయిన అఫ్జల్‌సాగర్ మాన్గార్ బస్తీకి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అఫ్జల్‌సాగర్ నాలా పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నాలాలో గల్లంతైన వారిని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. అలాగే హబీబ్‌నగర్ నాలా, అఫ్జల్‌సాగర్ నాలాల వెంబడి ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. మురికివాడలపై ప్రత్యేక దృష్టిని సారించాలని, కూలడానికి సిద్ధంగా ఉన్న వాంబే గృహాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఆవాసం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. మురికివాడల్లో స్వచ్ఛత కనపించడం లేదని, మురికి కూపంలా మారిన బస్తీలను కాస్త పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, దోమలు, ఈగలు విజృంభించకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అఫ్జల్‌సాగర్, మాన్గార్ బస్తీల భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షులు లంకల దీపక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్‌చంద్ర, డివిజన్ అధ్యక్షులు మధు, స్థానిక బీజేపీ నేతలు గోపి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు
అఫ్జల్‌సాగర్ నాలా బాధితులకు పరామర్శ