
ఆటోల దొంగ అరెస్ట్
మేడ్చల్ రూరల్: చెడు వ్యసనాలకు బానిసై..డబ్బుల కోసం ఆటోలను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..లింగాపూర్ గ్రామానికి చెందిన కొరుపతి శ్రీరాములు అలియాస్ రాము కొంత కాలంగా దుండిగల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాము తన జల్సాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా స్టీరింగ్ లాక్ (తాళం) లేని ఆటోలను దొంగిలించేందకు ప్లాన్ వేసుకుని మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో ఆటోలను దొంగలించారు. ఇటీవల మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో దొంగిలించగా పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న రామును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద నుండి మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.