షట్టర్స్‌ క్లోజ్‌ | Sakshi
Sakshi News home page

షట్టర్స్‌ క్లోజ్‌

Published Sun, Mar 3 2024 9:25 AM

- - Sakshi

‘ఎలివేటెడ్‌’ ఎఫెక్ట్‌..

కంటోన్మెంట్‌: రాజీవ్‌ రహదారి, ఎన్‌హెచ్‌–44 మార్గాల్లో ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్‌ల నిర్మాణంతో కంటోన్మెంట్‌లోని వ్యాపార కేంద్రాలు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. 70 శాతానికి పైగా వ్యాపార కేంద్రాలు ఈ రెండు మార్గాల్లోనే ఉన్నాయి. గరిష్టంగా 100 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న ఈ రోడ్లను 200 అడుగులకు విస్తరించనున్నారు. దీంతో ఈ రెండు మార్గాల్లో కొనసాగుతున్న వ్యాపారాలు ప్రశ్నార్థకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కంటోన్మెంట్‌కు సంబంధించి ఎస్‌ఆర్‌డీపీ ఎలివేటర్‌ కారిడార్‌ అనుమతులపైనే దృష్టిసారించింది. ఈక్రమంలో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

వైఎస్‌ఆర్‌ హయాంలోనే ప్రతిపాదనలు..

ఉత్తర తెలంగాణతో హైదరాబాద్‌ను కలిపేందుకు రాజీవ్‌ రహదారి, ఎన్‌హెచ్‌–44 ప్రధాన మార్గాలు. ఎన్‌హెచ్‌–44 మార్గంలో బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు 200 అడుగలకు పైగా వెడల్పు గల సర్వీసు రోడ్లు ఉండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేవు. రాజీవ్‌ రహదారి మాత్రం హంకీపేట నుంచి ప్యాట్నీ సెంటర్‌ వరకు ఇరుకుగా ఉంది. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు అనేకం. ఈ నేపథ్యంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ హయాంలో రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేపట్టారు. ఈ మార్గాన్ని 150 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 2014లో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ మార్గాల విస్తరణకు చర్యలు చేపట్టింది. కాగా, మిలటరీ స్థల సేకరణ కోసం కేంద్రాన్ని ఒప్పించడంలో జాప్యం జరిగింది. దీంతో పదేళ్లుగా పనులు కార్యరూపం దాల్చలేదు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశంపై కేంద్రంతో సంప్రదింపులు చేపట్టడంతో ఎట్టకేలకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యాయి.

విలువైన స్థలాలకు ప్రమాదం..

రాజీవ్‌ రహదారి మార్గంలో ప్యాట్నీ నుంచి తిరుమలగిరి లాల్‌బజార్‌ వరకు దారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో భారీ వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. రహదారి విస్తరణతో పరేడ్‌గ్రౌండ్‌, జింఖానా మైదానాల్లో కొంత స్థలంతో పాటు టివోలీ గార్డెన్స్‌, టివోలీ థియేటర్స్‌, మిలీనియం గార్డెన్స్‌, ఎన్‌సీసీ హెడ్‌ క్వార్టర్స్‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌, కేవీ పికెట్‌ స్కూల్‌కు సంబంధించి విలువైన స్థలాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రఖ్యాత సికింద్రాబాద్‌ క్లబ్‌లో దాదాపు రెండెకరాలు కూడా మాయమవుతాయి. అక్కడ నుంచి విక్రమ్‌పురి, పీఅండ్‌కాలనీ, కార్ఖానా, వాసవీకాలనీ, ఎల్‌బీకాలనీ నుంచి తిరుమలగిరి వరకు వందలాది కమర్షియల్‌ భవనాలున్నాయి. ఇకపై ఆయా దుకాణాలతో పాటు తిరుమలగిరి ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ కూడా మాయం కానుంది. ఎలివేటెడ్‌ కారిడార్లు కార్యరూపం దాలిస్తే కంటోన్మెంట్‌ అంతర్గత రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ పూర్తిగా తగ్గుతుంది. కానీ, అదే స్థాయిలో వ్యాపార అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే, ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే కంటోన్మెంట్‌లోనూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. అంతేకాదు ఉత్తర తెలంగాణలోని రామగుండం, కరీంనగర్‌, సిద్దిపేట మార్గం, నిజామాబాదాద్‌, తూప్రాన్‌ మార్గాల్లో ఇక్కట్లు లేని ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఆందోళనలో యజమానులు..

ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం అవసరమైన రక్షణ శాఖ భూముల వివరాలు తెలిపిన అధికారులు.. ప్రైవేటు స్థలాల సమాచారం మాత్రం వెల్లడించలేదు. దీంతో రోడ్డు విస్తరణ బారిన పడే భవనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. నష్ట పరిహారం విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారంతా మరింత గందరగోళానికి గురవుతున్నారు. గతంలో రోడ్లపై మార్కింగ్‌ చేసినప్పుడు కొందరు గ్రూపులవారీగా సంఘటితమయ్యారు. అయితే, విస్తరణ కోసం రక్షణ శాఖ స్థలాల కేటాయింపుపై జాప్యం జరుగుతుండటంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం ఖరారు కావడంతో నష్టపరిహారం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా, సికింద్రాద్‌ క్లబ్‌ ఎదురుగా దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఓ భారీ భవన నిర్మాణం ఇటీవల మొదలైంది. కంటోన్మెంట్‌లోనే అతిపెద్ద భవనంగా రూపొందుతున్న ఈ నిర్మాణంలో మెజారిటీ భాగం విస్తరణ బారిన పడే ప్రమాదముంది. దీంతో పాటు ఈ మార్గంలో నిర్మాణ దశలో ఉన్న పలు భవనాలపై ప్రతికూల ప్రభావం పడనుంది.

సమాన పరిహారం ఇవ్వాలి

రాజీవ్‌ రహదారి విస్తరణ వల్ల ఈ మార్గంలో వ్యాపారులకు, భవన యజమానులకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాసవీకాలనీలోని పలు భవనాలు కనుమరుగు అవుతాయి. నష్టపరిహారం కోసం కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గతంలోనే పోరాటానికి సన్నద్ధమయ్యాం. విస్తరణతో స్థలాలు, భవనాలు కోల్పోయే వారికి సమాన విలువ గల భూమి లేదా పరిహారం అందించాలి. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా తదుపరి లేన్‌లలో కొత్తగా నిర్మించే భవనాలకు ఎఫ్‌ఎస్‌ఐ మినహాయింపులు ఇవ్వాలి.

– సతీశ్‌గుప్తా, సామాజిక కార్యకర్త

70 శాతం వ్యాపార కేంద్రాలపై ప్రభావం

నష్ట పరిహారంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

ఆందోళనలో వ్యాపారులు, భవన యజమానులు

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement