ఎస్‌బిఐ గృహకల్ప శాఖలో రూ.32.8 లక్షలు మాయం | Sakshi
Sakshi News home page

ఎస్‌బిఐ గృహకల్ప శాఖలో రూ.32.8 లక్షలు మాయం

Published Thu, Feb 29 2024 7:48 PM

- - Sakshi

మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుంచి స్వాహా

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

నాంపల్లి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహకల్ప శాఖలో దొంగలు పడ్డారు. మృతి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అకౌంట్‌లో నుంచి రూ.32,80,000 మాయం చేశారు. బాధితుడు ప్రశాంత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. వీరికి రోహిణి, నందిని, ప్రశాంత్‌, వి.తరణి, వి.శాలిని అనే ఐదుగురు సంతానం. ప్రసాద్‌ పేరిట స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) గృహకల్ప శాఖలో ఖాతా ఉంది. మూడేళ్ల కిందట వీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మృతి చెందాడు. గత సోమవారం ఆయన కుటుంబసభ్యులు స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిసింది. దీంతో శాఖ మేనేజర్‌ సంప్రదించగా ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 22 వరకు రోజుకు రూ.5 లక్షల చొప్పున డ్రా చేశారని, ఫిబ్రవరి 22న రూ.2 లక్షల 80 వేలు డ్రా చేసినట్లు తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తులు తమ తండ్రి పేరున తప్పుడు కేవైసీని అప్డేట్‌ చేసుకుని, ఫోన్‌ నంబర్‌ను మార్చి ఖాతాలోని నగదును కాజేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులందరూ ఒకేచోట లేని కారణంగా బ్యాంకు ఖాతాను క్లోజ్‌ చేయలేకపోయామని తెలిపారు. డెత్‌ సర్టిఫికెట్‌, లీగలేర్‌ సర్టిఫికెట్‌ సమర్పించినా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Advertisement
 
Advertisement