ఢిల్లీలో చోరీ... సిటీలో విక్రయం! | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో చోరీ... సిటీలో విక్రయం!

Published Thu, Feb 29 2024 7:46 PM

-

సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీతో పాటు కర్ణాటకలో చోరీ చేసిన కార్లను హైదరాబాద్‌కు తరలించి తక్కువ ధరకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీలకు చెందిన పది మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.3.5 కోట్ల విలువైన 12 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నట్లు డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ ఎన్‌.శ్వేత తెలిపారు. నగరానికి చెందిన కార్తీక్‌, షేక్‌ అబ్దుల్లా, మహ్మద్‌ ఫెరోజ్‌, షేక్‌ షాహెద్‌ అలీ, జి.శివకుమార్‌, మహ్మద్‌ తౌసిఫ్‌, లవణ్‌ కుమార్‌ స్నేహితులు. వీరు ఏడుగురు తక్కువ ధరలో కార్లు ఖరీదు చేసి, విక్రయించాలని భావించారు. ఇందుకుగాను ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేసి, అందులో తమ కార్లను పోస్టు చేసిన కొందరు యజమానులను సంప్రదించారు. ఇలా వీరికి మదనపల్లెకు చెందిన సోను, సైఫ్‌ అలీ ఖాన్‌లతో పాటు బెంగళూరు వాసి సయీద్‌ పరిచయం ఏర్పడింది. కార్ల ధరపై బేరసారాలు ఆడుతున్న నేపథ్యంలోనే వీళ్లు చోరీ కార్లు అయితే మరింత తక్కువ ధరకు విక్రయించగలమని చెప్పారు. ఇందుకు నగరానికి చెందిన ఏడుగురూ అంగీకరించడంతో వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసుకున్నారు. వీటిలో ఢిల్లీకి చెందిన కొందరు చోరులూ సభ్యులుగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ముఠాలు ఢిల్లీ, బెంగళూరుల్లో చోరీ చేసిన వాహనాల ఫొటోలను వీటిలో పోస్టు చేసే వాళ్లు. ఆసక్తి చూపిన వారికి దాని రేటు చెప్పే వారు. బేరసారాల తర్వాత నగదు డిపాజిట్‌ చేయించుకుని, డ్రైవర్‌ ద్వారా వాహనం పంపేవారు. ఇలా ఇప్పటి వరకు ఢిల్లీలో చోరీ అయిన 11, బెంగళూరులో తస్కరణకు గురైన ఒక కారు సిటీకి వచ్చాయి. వీటిని నగరంలో ఉన్న ఏడుగురూ నెంబర్‌ ప్లేట్‌ మార్చి విక్రయానికి పెట్టారు. వాస్తవ ధరకంటే చాలా తక్కువ చెప్పే వీరు తొలుగ అడ్వాన్స్‌ తీసుకుని వాహనం అప్పగించారు. వాహనానికి సంబంధించిన పత్రాలు ఆయా ప్రాంతాల నుంచి రావాల్సి ఉందని, అవి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని చెప్పేవారు. ఆ తర్వాత నుంచి ఆ కస్టమర్‌కు దొరక్కుండా తప్పించుకుని తిరిగే వారు. వినియోగదారులు సైతం మొత్తం చెల్లించలేదనే ఉద్దేశంతో మిన్నకుండిపోయే వాళ్లు. కొందరు కస్టమర్లు ఇలా మోసపోగా... మరికొందరు ఇవి చోరీ వాహనాలని తెలిసీ ఖరీదు చేశారు. సీసీఎస్‌లోని స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ అధికారులు బుధవారం బహదూర్‌పుర చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నెంబర్‌ ప్లేట్‌ లేని వాహనంలో వస్తున్న లవణ్‌ కుమార్‌ వీరికి తారసపడ్డాడు. వాహనం ఆపగా... అతడు కారు దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో మిగిలిన వారినీ అరెస్టు చేశారు.

కర్ణాటకలోనూ కొన్ని వాహనాల అపహరణ

తక్కువ ధరకు నగరంలో అమ్మకం

గుట్టురట్టు చేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్‌

10 మంది అరెస్టు... 12 ఖరీదైన కార్లు స్వాధీనం

Advertisement
Advertisement