గాల్లో పల్టీలుకొట్టిన కారు | Sakshi
Sakshi News home page

గాల్లో పల్టీలుకొట్టిన కారు

Published Thu, Feb 29 2024 7:46 PM

-

బంజారాహిల్స్‌: ఒక కారు గాల్లో పల్టీలు కొట్టిన సంఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మలక్‌ పేటకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి(17) తన స్నేహితుడి(17)తో కలిసి బుధవారం ఉదయం కారులో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45 జంక్షన్‌ మీదుగా మాదాపూర్‌ వైపు వెళ్తున్నాడు. రోడ్‌ నంబర్‌ 45లోని ఫ్లైఓవర్‌ ఎక్కే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి గాలిలోకి ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడింది. అదే సమయంలో మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వస్తున్న క్యాబ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని రెండు కార్లను అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న విద్యార్థితోపాటు అతని స్నేహితుడికి, మరో కారు డ్రైవర్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా, ఎవరూ మద్యం సేవించలేదని తేలింది. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌ మధుసూదన్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లకు వాహనాన్ని ఇచ్చిన కారు యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

వలస కార్మికుడి దారుణ హత్య

జీడిమెట్ల: బీహార్‌కు చెందిన వలస కార్మికుడు దారుణహత్యకు గురైన సంఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం హెచ్‌ఎంటీలోని నిర్మాణుష్య ప్రదేశంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతను హత్యకు గురైనట్లు గుర్తించి క్లూస్‌టీం సహాయంతో, అధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో బీర్‌ సీసాలు పడి ఉండటంతో వాటితో తలపై మోది హత్యచేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం వద్ద లభించిన అధారాల ప్రకారం మృతుడు బీహార్‌కు చెందిన రమేష్‌రామ్‌(48)గా గుర్తించారు. అతను కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రాంరెడ్డినగర్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలోని డ్రమ్ముల పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఐదురుగు కుమారులు ఉన్నారు. మంగళవారం ఉదయం రమేష్‌రామ్‌ బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇంటి నుండి బయటికి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement