దివ్యాంగుల ఉపాధి నైపుణ్యాల కల్పనకు కృషి | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల ఉపాధి నైపుణ్యాల కల్పనకు కృషి

Published Wed, Feb 7 2024 5:58 AM

- - Sakshi

హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావు

రాయదుర్గం: దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు సమగ్ర విద్య, ఉపాధి కోసం నైపుణ్యాల కల్పనకు ప్రోత్సహిస్తామని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బీజే రావు స్పష్టం చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని హెచ్‌సీయూలోని వైస్‌ చాన్స్‌లర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో హెల్ప్‌ ది బ్లైండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌టీబీఎఫ్‌) సహకారంతో శిక్షణ పొందుతున్న దృష్టి లోపం దివ్యాంగ ట్రైనీలకు ల్యాప్‌టాప్‌లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ షామన్న, పి.తుకారాం, ఎన్‌.అన్నవరం, ఆశిష్‌ జాకబ్‌ థామస్‌, శివాజీరావు, నటరాజ్‌ శంకరన్‌, దీపా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

రహీల్‌ ఎస్కేప్‌ కేసులో మరో ఇద్దరి పాత్ర

పంజగుట్ట: ప్రజాభవన్‌ ఎదురుగా రోడ్డు ప్రమాదం చేసిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ కుమారుడు రహీల్‌ ఎస్కేప్‌ కేసులో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.విజయ్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. సోమవారం గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో చిక్కిన పంజగుట్ట ఠాణా మాజీ ఇన్‌స్పెక్టర్‌ బి.దుర్గారావు విచారణలో వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయని, దీంతో వీరిని నిందితులుగా చేర్చి గాలిస్తున్నామని పేర్కొన్నారు. దుర్గారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. సొంత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైందని వివరించారు. రహీల్‌ను తప్పించడంలో హనుమాన్‌, వెంకటేశ్వరరావు పాత్ర ఉన్నట్లు దుర్గారావు బయటపెట్టాడని, దీంతో ఈ ఇద్దరినీ 14, 15వ నిందితులుగా చేర్చామని విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరినీ అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. దుర్గారావుపై ఐపీసీ 201, 217, 218, 225 ఏ, రెడ్‌విత్‌ 119 సెక్షన్ల కింద ఆరోపణలు చేసినట్లు వివరించారు. షకీల్‌, రహీల్‌ సహా విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసినట్లు డీసీపీ తెలిపారు.

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో..

మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

మియాపూర్‌: కేసు విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళపై దురుసుగా ప్రవర్తించిన మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు. తన భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియాపూర్‌ ఠాణాకు వచ్చి ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌కు మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తన పట్ల ప్రేమ్‌కుమార్‌ దురుసుగా ప్రవర్తించాడని సదరు మహిళ సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ జరిపిన అనంతరం ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీపీ ఆదేశాలు జారీ చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రేమ్‌కుమార్‌ గతంలో సీఐడీలో పని చేశారు. గత సంవత్సరం జులై నెలలో మియాపూర్‌ పీఎస్‌కు బదిలీపై వచ్చారు. కాగా.. మూడు నెలల క్రితం ఇదే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో ఓ ఎస్‌ఐ సస్పెండ్‌ అయిన విషయం మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉచిత విద్యుత్‌ కోసం వివరాల సేకరణ

బస్తీల్లో ప్రారంభించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

సాక్షి, సిటీబ్యూరో: గృహ జ్యోతి అమలు కోసం విద్యుత్‌ వినియోగదారుల నుంచి వివరాల సేకరణ, బిల్లింగ్‌ మిషన్‌లో నమోదు ప్రక్రియను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ ప్రారంభించారు. మంగళవారం ముషీరాబాద్‌లోని పలు బస్తీల్లో సీఎండీ విద్యుత్‌ సిబ్బందితో కలిసి పర్యటించారు. వినియోగదారుల నుంచి ఆధార్‌, రేషన్‌ కార్డు, విద్యుత్‌ కన్జూమర్‌ నంబర్‌లను సేకరించి అక్కడికక్కడే బిల్లింగ్‌ మిషన్‌లో అప్‌లోడ్‌ చేశారు. అర్హులైన కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌ పొందడానికి మీటర్‌ రీడింగ్‌ కోసం వచ్చే విద్యుత్‌ సిబ్బందికి ఆధార్‌, రేషన్‌ కార్డు, విద్యుత్‌ కన్జూమర్‌ నంబర్‌ ఇవ్వాలని సూచించారు.

 ల్యాప్‌టాప్‌లు అందుకున్న దివ్యాంగులతో బీజే రావు తదితరులు
1/2

ల్యాప్‌టాప్‌లు అందుకున్న దివ్యాంగులతో బీజే రావు తదితరులు

ప్రేమ్‌కుమార్‌
2/2

ప్రేమ్‌కుమార్‌

Advertisement
 
Advertisement