ఎట్టకేలకు.. | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..

Published Wed, Feb 7 2024 5:58 AM

- - Sakshi

19న కౌన్సిల్‌ మీటింగ్‌

హైకోర్టులో పిటిషన్‌ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

బడ్జెట్‌, సాధారణ సమావేశం రెండూ ఒకే రోజు

అసెంబ్లీ తరహాలో రెండు మూడు రోజులైనా జరపాలన్న సభ్యులు

సాక్షి, సిటీబ్యూరో: విషయం హైకోర్టుకు చేరిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు కసరత్తు మొదలైంది. సుదీర్ఘకాలంగా కౌన్సిల్‌ సమావేశం జరగకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేవంటూ మల్కాజిగిరి కార్పొటర్‌ శ్రవణ్‌ (బీజేపీ) హైకోర్టును ఆశ్రయించడం.. అందుకు వివరణనివ్వాల్సిందిగా స్టాండింగ్‌ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించడంతో జీహెచ్‌ఎంసీలో చర్యలు మొదలయ్యాయి. కార్పొరేటర్లతో ఆగమేఘాలపై మంగళవారం మేయర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవని పక్షంలో ఈ నెల 19న కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అదే రోజు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించాలని భావించారు. రేపటి (గురువారం) నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం.. ఈ నెల రెండో వారం తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుందనే అంచనాల నేపథ్యంలో ఈ తేదీని నిర్ణయించారు. కుదరని పక్షంలో అటూఇటూగానైనా నిర్వహించే అవకాశం ఉంది.

ఆ సమావేశాలు జరగని రోజుల్లోనే..

సాధారణంగా సభ్యులు సమావేశంలో ప్రస్తావించాల్సిన ప్రశ్నల్ని స్వీకరించేందుకు, అధికారులు వాటికి లిఖితపూర్వక సమాధానాలు సిద్ధం చేసేందుకు దాదాపు నెలరోజుల సమయం పడుతుంది. కానీ.. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో పాటు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వస్తే ఇక సాధ్యం కాదు గనుక త్వరితంగా సమావేశం నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ, లోక్‌సభ సభ్యులు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాలు జరగని రోజుల్లో మాత్రమే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తారు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సభ్యుల నుంచి ప్రశ్నలను తీసుకోవడం కూడా ప్రారంభించారు.

ఒకే రోజు రెండు సమావేశాలు..

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి స్టాండింగ్‌ కమిటీ లేకపోవడంతో రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ నేరుగా కౌన్సిల్‌ సమావేశంలోనే ఆమోదం పొందేందుకు అనుమతించాల్సిందిగా సీఎంను కలిసిన మేయర్‌ విన్నవించడం.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేరోజు ఉదయం బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం, దాని తర్వాత సాధారణ సమావేశం నిర్వహించాలని భావించారు. ఫలానా తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు.

కుదరని సయోధ్య?

మేయర్‌, కమిషనర్ల మధ్య ఇంకా సఖ్యత కుదరలేదని సమాచారం. సీఎం ఆదేశాల నేపథ్యంలో కాబోలు.. బడ్జెట్‌ సమావేశ నిర్వహణకు ఓకే అన్న కమిషనర్‌.. సాధారణ కౌన్సిల్‌ సమావేశ నిర్వహణ కు ఇంకా సుముఖంగా లేనట్లు తెలిసింది.

రెండు మూడు రోజులు నిర్వహించాలి

● ఎంతోకాలం తర్వాత జరిగే సమావేశంలో సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో సభ్యులు కోరారు. అవసరమైతే అసెంబ్లీ తరహాలో రెండుమూడు రోజుల పాటు సమావేశాలు కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇతరత్రా ప్రభుత్వ విభాగాలైన వాటర్‌బోర్డు తదితరాలు, జీహెచ్‌ఎంసీకి మధ్య సంబంధం లేకుండా ఉండటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి మధ్య అనుసంధానం ఉండేలా ఒక తీర్మానం చేయాలని సభ్యులు సూచించారు. అలాగే మరికొన్ని అంశాలపై తీర్మానాలు చేయాలని చెప్పారు.

● జీహెచ్‌ఎంసీలో డిప్యుటేషన్లపై కొనసాగుతున్న వారిని పంపించడం, పండగల సందర్భంగా చేసే ఏర్పాట్లకు నిధుల మంజూరు తదితరాలు వాటిలో ఉన్నాయి. పారిశుద్ధ్యం, దోమల తీవ్రత, కుక్కకాట్లు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించాలని భావించారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్‌ నుంచి డిప్యూటీ మేయర్‌ శ్రీలత, సామల హేమ, బి.గీతాప్రవీణ్‌, సతీష్‌, సింధురెడ్డి, బీజేపీ నుంచి శ్రవణ్‌, వంగ మధుసూదన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రజితా పరమేశ్వర్‌రెడ్డి, విజయారెడ్డి, సీఎన్‌ రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా ముస్తఫాబేగ్‌, సయ్యద్‌ మినాజుద్దీన్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement