Hyderabad: అనుమానంతో తల నరికిన భర్త | Sakshi
Sakshi News home page

Hyderabad: అనుమానంతో తల నరికిన భర్త

Published Wed, Jan 17 2024 5:56 AM

- - Sakshi

అబ్దుల్లాపూర్‌మెట్‌: అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేశాడు. తల, మొండెం వేరు చేశాడు. ఈ దుర్ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌, పుష్పవతి (41) దంపతులు. వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం పుష్పవతి తన కూతురుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ 5/13 బ్లాక్‌లో నివాసముంటోంది.

తన కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి ఎల్‌బీనగర్‌లో ఉంటున్న విజయ్‌కుమార్‌ అప్పుడప్పుడు భార్య, కూతురు వద్దకు వస్తుండేవాడు. ఈ క్రమంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ కాలనీకి ఆనుకుని.. ప్రభుత్వం నిర్మించిన నూతన భవన సముదాయంలోని 66/7 బ్లాక్‌లో తన సోదరికి ఇల్లు వచ్చిందని భార్యకు చెప్పాడు. ఆ ఇంటిని శుభ్రం చేసి వద్దామంటూ మంగళవారం పుష్పవతి వద్దకు చేరుకున్నాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ముందస్తు పథకం ప్రకారమే వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తల, మొండెం వేరుచేసి పరారయ్యాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ మన్మోహన్‌, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం 2.30గంటలకు సంఘటన జరిగిన వెంటనే పురాణాపూల్‌లో ఉండే పుష్పవతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వగా.. రాత్రి వరకు కూడా రాలేదు. దీంతో మృతురాలికి తన తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేనట్లుందని పోలీసులు పేర్కొన్నారు. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement