ఓటింగ్‌ శాతం | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ శాతం

Published Sat, Nov 25 2023 4:44 AM

- - Sakshi

ప్రజల్లో అవగాహనకు కృషి

30న పోలింగ్‌కు అంతా సిద్ధం

పకడ్బందీగా ఎన్నికల కోడ్‌ అమలు

ఎన్నికల నిర్వహణకు 12,500 మంది సిబ్బంది

‘సాక్షి’తో మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.గౌతమ్‌

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో గతంలో కంటే ఓటింగ్‌ శాతాన్ని పెంచుతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.గౌతమ్‌ తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 51.69 శాతం, 2018 ఎన్నికల్లో 55.88 శాతం ఓటింగ్‌ నమోదైందని, ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహనతోకూడిన చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ నెల 30న ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ల కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మేడ్చల్‌ ఈవీఎంలు బోగారంలోని హోలీమేరీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో, మల్కాజిగిరి ఈవీఎంలు సైనిక్‌పురి భవన్స్‌లో, కూకట్‌పల్లి ఈవీఎంలు జేఎన్‌టీయూలో, ఉప్పల్‌ ఈవీఎంలు రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో, కుత్బుల్లాపూర్‌ ఈవీఎంలు లయోలా కాలేజ్‌ నుంచి పంపిణీ చేసేలా అన్ని సిద్ధం చేసినట్లు గౌతమ్‌ తెలిపారు. జిల్లాలో ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో విధుల నిర్వహించేలా ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై తెల్పిన వివరాలు ఆయన మాటల్లోనే...

అసెంబ్లీ బరిలో 126 మంది అభ్యర్థులు

జిల్లాలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 126 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి గుర్తులను కూడా కేటాయించాం. పోలింగ్‌ కేంద్రాలకు అనుగుణంగా ఇప్పటికే మొదటి ర్యాండమైజేషన్‌ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) లను తరలించి స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య కంటే 25 శాతం అదనంగా (రిజర్వు) బ్యాలెట్‌ యూనిట్లు. కంట్రోల్‌ యూనిట్లను కేటాయించాం.

పకడ్బందీగా కోడ్‌ అమలు

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్భందీగా అమలు చేస్తున్నాం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 16 విభాగాలకు 22 మంది నోడల్‌ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చాలా కమిటీలు పనిచేస్తున్నాయి.

పారదర్శకంగా బ్యాలెట్‌ ఓటింగ్‌

ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు మొత్తం 1070 మంది ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా ఫారం 12 (డి) పంపిణీ చేశాం. సీక్రెట్‌ ఓటింగ్‌ కోసం ఓటింగ్‌ కంపార్టుమెంట్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా 6 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ వెసులుబాటు కల్పించాం. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఉండదు.

ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో

1500 మంది ఓటేయొచ్చు...

జిల్లాలో 2,439 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. సమస్యాత్మకంగా గుర్తించిన వెయ్యి పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను నియమించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు నియోజకవర్గానికి ఐదు చొప్పున 25 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. దివ్యాంగులకు 5, యువతకు 5 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆయా ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులను పంపిణీ చేశాం. వందశాతం పోలింగే లక్ష్యంగా ప్రచారం కల్పిస్తున్నాం. పోలింగ్‌ నిర్వహణకు 12,500 మంది ఎన్నికల సిబ్బందిని నియమించాం. ఆరుగురు ఎన్నికల పరిశీలకులతోసహా మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల ప్రచార సభలు, సమావేశాల కోసం సువిధ యాప్‌ ద్వారా అందిన దరఖాస్తులకు సకాలంలో అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి వరకు 260 అనుమతులు ఇచ్చాం. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 315 ఫిర్యాదులు అందగా వాటిని పరిష్కరించాం. జిల్లాలోని 14 చెక్‌పోస్టుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నిఘా బృందాల పనితీరును కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీటీజెడ్‌ కెమెరాలను వారి వాహనాలకు అమర్చాం. ఇప్పటి వరకు చెక్‌ పోస్టుల తనఖీల్లో అభరణాల విలువతో కలిపి నగదు మొత్తం రూ.50.96 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement