బొమ్మ పడుద్ది! | Sakshi
Sakshi News home page

బొమ్మ పడుద్ది!

Published Mon, Nov 20 2023 6:48 AM

- - Sakshi

తాయిలాలపై పార్టీ గుర్తులు, అభ్యర్థుల ఫొటోలు

క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న పోలీసు, వాణిజ్య పన్నుల శాఖ

26 వస్తువులపై ఎన్నికల సంఘం నిఘా

ఆయా వస్తువుల వ్యయం అభ్యర్థుల ఖర్చులోనే జమ

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాయిలాలు, హామీల వర్షం కురిపిస్తుంటారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల ప్రలోభాలతో మచ్చిక చేసుకుంటారు. యువతీయువకులు, మహిళలు, పురుషులు, వృద్ధులు విభాగాల వారీగా తాయిలాలు అందిస్తూ ఆకర్షిస్తుంటారు. బహుమతులు, గిఫ్ట్‌లు, తాయిలాలపై ఎన్నికల సంఘం పటిష్ట నిఘా పెట్టింది. రాజకీయ నాయకులు ఓటర్లకు అందించే రకరకాల వస్తువుల జాబితాను సిద్ధం చేసింది.

26 వస్తువుల జాబితా ఇదే..

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నిఘా పెంచింది. రాజకీయ నాయకుల బొమ్మలు, పార్టీ గుర్తులు కలిగిన బెడ్‌ షీట్లు, టవళ్లు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, కాస్మోటిక్స్‌, క్రికెట్‌ కిట్లు, జిమ్‌ పరికరాలు, కుంకుమ భరిణిలు, మిక్సీలు, మొబైల్‌ ఫోన్లు, రెడీమేడ్‌ దుస్తులు, చీరలు, పాఠశాల బ్యాగ్‌లు, కుట్టు మిషన్లు, స్టీల్‌ వస్తువులు, టీ షర్టులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, టీవీ సెట్లు, బొమ్మలు, ట్రావెల్‌ బ్యాగ్‌లు, సూట్‌ కేసులు, గొడుగులు, గోడ గడియారాలు, వాచ్‌లు వంటి 26 రకాల వస్తువుల పంపిణీపై నిఘా పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రమంతటా నిఘా పెట్టింది.

రవాణా, కొరియర్‌ సర్వీస్‌లపై నిఘా..

అనుమానాస్పద వస్తువులను పట్టుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించింది. రైల్వే పార్శిల్‌ కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు గోడౌన్లు, ప్రయివేటు బస్సులు, పార్శిల్‌ కేంద్రాలు, కొరియర్‌ సర్వీస్‌ కేంద్రాలు తదితర రవాణా, నిల్వ కేంద్రాలపై ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాయకులు రవాణా చేస్తున్న, నిల్వ చేసిన కోట్లాది రూపాయల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ వ్యయం అభ్యర్థుల ఖర్చులో జమ..

ఎన్నికల వేళ తాయిలాల పంపకాలు చేయాలంటే వస్తువులను గ్రామాలకు తరలించాలి. వ్యాపారుల పేరుతో వచ్చే వస్తువులు ఏంటీ, వాటిపై రాజకీయ ముద్రలు గానీ లేదా బిల్లులు లేకుండా వస్తున్నవి ఏమైనా ఉన్నాయా అని పోలీసులు, వాణిజ్య పన్నుల శాఖ ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ప్రలోభ పెట్టు వస్తువులపై పార్టీలకు చెందిన స్టిక్కర్లు, నాయకుల బొమ్మలు ఉన్నట్లయితే వాటి కొనుగోలు బిల్లులతో సరఫరా చేస్తూ పట్టుబడితే వాటిని ఆయా నాయకుల పేరుతో ఎన్నికల ఖర్చులో జమ చేస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న ఆయా వస్తువుల విలువపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లించిన తర్వాత విడుదల చేస్తారు.

Advertisement
Advertisement