ఎన్నికల వేళ గ్రేటర్‌లో భారీగా మద్యం | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ గ్రేటర్‌లో భారీగా మద్యం

Published Sat, Nov 18 2023 6:42 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బోడుప్పల్‌కు చెందిన ఓ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి నుంచి పది మద్యం సీసాలు, చికెన్‌, స్నాక్స్‌ ప్యాకెట్‌లు వచ్చాయి. కానీ తమ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారి సంఖ్యకు అవి ఏ మాత్రం చాలవని అపార్ట్‌మెంట్‌ ప్రతినిధి చెప్పడంతో మరో ఐదు బాటిళ్లను అదనంగా అందజేశారు. ఇలా ఒక బోడుప్పల్‌లోనే కాదు గ్రేటర్‌ అంతటా గత రెండు మూడు రోజులుగా మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు మరో 13 రోజులే ఉండడంతో మొదటి విడత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే డివిజన్‌ల వారీగా పెద్ద ఎత్తున బాటిళ్లను నిల్వ చేసినట్లు సమాచారం. ఇందుకోసం పెళ్లిళ్లు, వేడుకల పేరిట, రకరకాలుగా ఎకై ్సజ్‌శాఖ నుంచి మద్యం కొనుగోళ్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ఒక్కో ఇంట్లో, అపార్ట్‌మెంట్‌లలో, కాలనీల్లో ఉండే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బాటిళ్లను అందజేస్తున్నట్లు సమాచారం. దీంతో మద్యం అక్రమ అమ్మకాలపై ఎకై ్సజ్‌ అధికారులు చేపట్టిన చర్యలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల అధికారుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తుండగా మరికొన్ని చోట్ల ఆబ్కారీశాఖ అధికారుల అండదండలతోనే రాజకీయ నాయకులకు ఎన్నికల మద్యం పంపిణీని కొనసాగించడం గమనార్హం. బాటిళ్ల పంపిణీలో డివిజన్‌ స్థాయి నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌ల నుంచి కాలనీ సంఘాలకు, కమ్యూనిటీ సంఘాలకు చేరవేస్తున్నారు.

నిండుగా నిల్వలు..

● మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున నిల్వ చేసేందుకు అపార్ట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. నెల రోజుల కోసం వాటిని అద్దెకు తీసుకొని బాటిళ్లను అక్కడికి చేరవేస్తున్నట్లు వివిధ పార్టీలకు చెందిన శ్రేణులు చెబుతున్నాయి. కొన్నిచోట్ల కమ్యూనిటీ హాళ్లకు చేరవేసి అక్కడి నుంచి స్థానిక బస్తీల్లో అందజేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే మద్యం కట్టడికి ఎన్నికల సంఘం ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ స్థానికంగా అవి నీరుగారుతున్నాయి.

● నగరంలోని అన్ని వైన్‌షాపులలో గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో విక్రయించిన మద్యంపైన 30 శాతం కంటే ఎక్కువగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. మరోవైపు మద్యం కొనుగోళ్లలో రాజకీయ పార్టీలు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఒకే వైన్‌షాపు నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయకుండా డివిజన్‌ల వారీగా ఎక్కడికక్కడ కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే పుట్టిన రోజు వేడుకలు, సన్మానాలు, సమావేశాల పేరిట గ్రేటర్‌లో మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా.

● ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు నేరుగా ఓటరుకే చేరేవిధంగా అందజేయడం కోసం రాజకీయ నాయకులు నిల్వలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. ఎన్నికల నిఘా పరిశీలకులకు కూడా ఎలాంటి అనుమానాలు రాకుండా అభ్యర్థులు ఈ బాధ్యతలన్నింటినీ స్థానిక నాయకులకే అప్పగిస్తున్నారు. కేంద్రీకరణ పద్ధతిలో కాకుండా మద్యం కొనుగోళ్ల నుంచి పంపిణీ వరకు పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ వికేంద్రీకరించడంతో గుట్టుగా లిక్కర్‌ కిక్కెక్కిస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా..

ఒకవైపు నగరంలోని మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల నుంచి కూడా మద్యం వచ్చి చేరుతోంది. చెక్‌పోస్టుల వద్ద పనిచేసే కొద్ది మంది సిబ్బంది సహకారంతోనే మద్యం బాటిళ్లు రాష్ట్రాలు దాటి నగరానికి చేరుకుంటున్నాయి. గతంలో ఒడిశా నుంచి హైదరాబాద్‌ వరకు అక్రమ మద్యం ప్రవహించిన సంగతి తెలిసిందే. దీనిని అధికారులు కల్తీ మద్యంగా గుర్తించి అరికట్టారు. ఎన్నికల సందర్భంగా కల్తీ మద్యం కూడా పెద్ద ఎత్తున సరఫరా అయ్యే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీశాఖ ఇటీవల కొన్ని కంటితుడుపు చర్యలు చేపట్టినప్పటికీ నిఘాను మరింత సమర్థంగా కొనసాగించలేకపోవడం వల్లే మద్యం యథేచ్ఛగా ప్రవహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డివిజన్‌ల వారీగా బాటిళ్ల నిల్వలు

అపార్ట్‌మెంట్‌లు, కాలనీలకు పంపిణీ

పెళ్లిళ్లు, వేడుకల పేరిట కొనుగోళ్లకు అనుమతులు

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న నాయకులు

చోద్యం చూస్తున్న ఆబ్కారీ అధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement