ఒకే పేరు.. గుర్తే వేరు! | Sakshi
Sakshi News home page

ఒకే పేరు.. గుర్తే వేరు!

Published Fri, Nov 17 2023 4:28 AM

-

ఎన్నికలు జరిగినప్పుడల్లా ఒకే పేరు కలిగిన వేర్వేరు అభ్యర్థులు పోటీ చేయడం పరిపాటి. ఈసారి గ్రేటర్‌లో కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి సమస్య ఉంది. ఎన్నికల ప్రచారం సంగతి ఎలా ఉన్నా ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకే పేరుతో ఇద్దరు ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతుంటారు. అలా ఒకే పేరు కలిగిన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో కొన్ని గ్రేటర్‌ పరిధిలో ఉన్నాయి. ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డి.సుధీర్‌ రెడ్డిలు తలపడుతున్నారు. గోషామహల్‌లో వ్యాస్‌ల బెడద నెలకొంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నందకిశోర్‌ వ్యాస్‌ కాగా శుభం వ్యాస్‌, సందీప్‌ వ్యాస్‌లు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉప్పల్‌ నుంచి బండారి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా ఏడీఆర్‌ పార్టీ అభ్యర్థిగా మన్నె లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలవగా.. ఎం. గోపాల్‌ ఏఐహెచ్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే.. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా ఉప్పలపాటి శ్రీనివాస్‌ యుగ తులసి అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో తోకల శ్రీనివాస్‌ రెడ్డి బీజేపీ అభ్యర్థి కాగా కె. శ్రీనివాస్‌ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా కె.కిషన్‌ రెడ్డి ఏడీఆర్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాగా అదే పేరుతో ఉన్న కె. లక్ష్మారెడ్డి జన శంఖారావం పార్టీ అభ్యర్థిగా.. ఇదే నియోజకవర్గం నుంచి మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా ఎం. సబిత స్వతంత్ర అభ్యర్థిగా తలపడుతుండటం గమనార్హం.

– లక్డీకాపూల్‌/చైతన్యపురి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement