ఎవరికో! | Sakshi
Sakshi News home page

ఎవరికో!

Published Thu, Nov 9 2023 6:00 AM

- - Sakshi

తొలి ఓటు

యువ ఓటర్లపై అభ్యర్థుల నజర్‌

గ్రేటర్‌లో మొదటిసారి ఓటేయనున్న 1.8 లక్షల మంది

వీరిని ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థుల ప్రచారం

ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధే ప్రధాన ఎజెండా

నోటా నొక్కుతారేమోనని అభ్యర్థుల్లో టెన్షన్‌

గత ఎన్నికల్లో చాలా చోట్ల మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో తొలి ఓటు అత్యంత కీలకం. అందుకే మొదటిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న యువ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి ప్రధాన రాజకీయ పార్టీలు. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాల్లో తొలి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో కీలకంగా మారాయి. ‘నచ్చితే ఓటేస్తాం.. లేకపోతే నోటాకు సై అంటాం’ అనే యువతరం ధోరణితో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. గతంలో ఎన్నికలు, ఓటు అంటే అంతగా ఇష్టం చూపని యువతరంలో క్రమంగా మార్పు వచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించే తత్వం పెరిగింది. ఓటుతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకునే స్థాయిలో వారి ఆలోచనా ధోరణిలో మార్పులొచ్చాయి.

ఉద్యోగాలు, అభివృద్ధే ఎజెండా..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 18– 19 ఏళ్లున్న ఓటర్లు 1.8 లక్షల మంది ఉండగా.. 18– 29 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 17.3 లక్షలు. ఈ యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. సాంకేతికత అందుబాటులో సమస్త సమాచారం అరచేతిలోకి వచ్చేసింది. దీంతో యువ ఓటర్ల సామాజిక ఆలోచనలు మారిపోయాయి. రాజకీయాలు, ఎన్నికలు, అభ్యర్థులు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉంటున్నారు. రాజకీయ పార్టీల విధానాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్నారు. అభ్యర్థుల గుణగణాలను ఉతికి పారేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం, స్కాంలు, అవినీతి వంటి వాటిపై నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి, ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించే పార్టీలకు ఓటు వేస్తామని పేర్కొంటున్నారు.

ఎన్నెన్నో పాట్లు..

యువ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ యువ ఓటర్లను చేరుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల వేదికగా చేసుకుంటున్నాయి. షార్ట్‌ వీడియోలు, రీల్స్‌ చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేటీఆర్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వంటి పలువురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాలకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. బస్తీలు, కాలనీల్లోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు క్రికెట్‌ కిట్లు, పండగలకు సాంస్కృతిక కార్యక్రమాలు, యువతుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్మార్ట్‌ వాచ్‌లు వంటివి పంపిణీ చేస్తున్నారు.

అభ్యర్థుల్లో నోటా టెన్షన్‌..

ప్రస్తుత ఎన్నికల్లో నోటా ఓట్ల చీలిక చిన్నదే అయినా కొంతమంది అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొద్దిపాటి తేడాతో ఓడిపోయిన స్థానాల్లో మెజారిటీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులకు నోటా టెన్సన్‌ పట్టుకుంది. ఆ ఉదంతాలు ఇలా..

2018 శాసనసభ ఎన్నికలలో అంబర్‌పేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌, బీజేపీ నుంచి కిషన్‌ రెడ్డిపై కేవలం 1,016 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు 1,462.

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణా రెడ్డిపై 9,227 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ నోటా ఓట్లు 2,171.

ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. బీఎస్‌పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై కేవలం 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో పోలైన నోటా ఓట్లు 1,151.

వికారాబాద్‌ (ఎస్సీ) నియోజకర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ ఆనంద్‌ మెతుకు కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై 2,993 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇక్కడ నోటా ఓట్లు 1,531.

ఖైరతాబాద్‌లో 35 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయగా.. అందరిని పక్కన నెట్టి నోటా 5వ స్థానంలో నిలిచింది.

1/2

2/2

Advertisement
Advertisement