వాట్సాప్‌ వార్‌! | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ వార్‌!

Published Sat, Nov 4 2023 4:36 AM

- - Sakshi

నగరంలో ఆన్‌లైన్‌ ఎన్నికల యుద్ధం
కుల సంఘాల కొట్లాటలు..

ఇబ్బడిముబ్బడిగా వాట్సాప్‌ గ్రూపులు

ప్రధాన పార్టీల గెలుపోటములపై పోస్టుల వెల్లువ

ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యంగ్యాస్త్రాలు

సగటు ఓటర్లను చికాకు పరుస్తున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: అదిగదిగో వినిపిస్తోందా యుద్ధభేరి.. బస్తీల్లో, కాలనీల్లో, రహదారులపై, అపార్ట్‌మెంట్‌లలో హోరెత్తించే ఎన్నికల పోరు సంగతి సరే. జిందాబాద్‌లు, జై కొట్టడాలు, పలకరింపులు, కరచాలనాలు అంతటా కనిపిస్తున్నాయి. ప్రచార రథాలు పరుగులు తీస్తున్నాయి. మైకులు రోడ్డెక్కి కేకలు వేస్తున్నాయి. ఇదంతా కళ్ల ముందు కనిపించే హోరు.. కానీ బరిలోకి దిగిన అభ్యర్తుల గెలుపోటములను డిసైడ్‌ చేసే అసలు సిసలైన వార్‌ మాత్రం సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలతో వాట్సాప్‌ గ్రూపుల్లో కేక పుట్టిస్తున్నారు. ఎన్నికల కాక రగిలిస్తున్నారు. చినికి చినికి గాలివాన మారినట్లు ఆన్‌లైన్‌ ఎన్నికల యుద్ధం వ్యక్తిగత వైరుధ్యాలకు, ఈర్షాద్వేషాలకు దారితీస్తోంది. నిజానికి కళ్ల ముందు కనిపించే కఠోరమైన వాస్తవాల కంటే మొబైల్‌ ఫోన్‌లో దర్శనమిచ్చే అసత్యాలు, అర్ధసత్యాలే జనజీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం సగటు ఓటరు బలహీనతను కనిపెట్టి అదే పనిగా సోషల్‌ మీడియాలో విజృంభిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై కత్తులు దూస్తున్నాయి. వాదనలు, ప్రతివాదనలు, ఘర్షణలు, సంఘర్షణలు సగటు ఓటరు వారిని కట్టిపడేస్తున్నాయి. దీంతో ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు మొబైల్‌ ఫోన్‌ మాయాజాలంలో కొట్టుకుపోయే గ్రూపులకు ఎన్నికల వాట్సప్‌ వార్‌ ఒక వినోద క్రీడగా మారింది. కొండొకచో అత్యంత చికాకు పుట్టించే ఆటగా కూడా మారింది.

ఏ గ్రూపు చూసినా ఎన్ని‘కలహాలే’..

● ఎన్నికల నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా వాట్సాప్‌ గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. కాలనీ సంక్షేమ, అపార్ట్‌మెంట్‌ సంఘాలు, స్నేహితులు, గృహిణులు, ఉద్యోగులు, వాకర్స్‌ తదితర వర్గాలకు చెందిన వేలాది గ్రూపుల్లో ఇప్పుడు పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం గుడ్‌ మార్నింగ్‌, గుడ్‌ ఈవినింగ్‌ వంటి పలకరింపులతో, పండుగల శుభాకాంక్షలతో దర్శనమిచ్చిన వాట్సప్‌ గ్రూపుల్లో ఇప్పుడు ప్రధాన పార్టీల నాయకుల ప్రసంగాలు, వార్తాకథనాల క్లిప్పింగులు వైరల్‌గా మారుతున్నాయి. వాటికి ప్రత్యర్థులు విమర్శలు, వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలకు చెందిన వీరాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అనేక చోట్ల ఈ పరిణామాలు వ్యక్తిగతమైన దూషణలకు, తిట్ల పురాణాలకు దారితీస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న వాళ్లే ఇప్పుడు వాట్సాప్‌ వార్‌లో శత్రువుల్లా మారారని కర్మన్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన ఒక గ్రూప్‌ అడ్మిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన గ్రూపులు ఇప్పుడు శత్రుశిబిరాలుగా మారాయని చెప్పారు.

మొబైల్‌ ‘షాక్‌’...

‘తెల్లవారిందంటే చాలు మొబైల్‌ ఫోన్‌ తెరవాలంటే షాక్‌ కొట్టినట్లవుతుంది. ఎవరు ఎలాంటి పోస్టు పెడతారో తెలియదు. ఊదరగొట్టే ఉపన్యాసాలు, అబద్ధాలు, అసత్యాలను చూడాలంటేనే చిర్రెత్తుకొస్తోంది’అని కుషాయిగూడకు చెందిన ఓ టీచర్‌ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నుంచి నిజాయతీని, నిబద్ధతను ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ వివిధ వర్గాలుగా ఉండే సాధారణ ప్రజలు ఆయా పార్టీల అబద్ధపు ప్రచారాల్లో కొట్టుకుపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement