జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు

Published Fri, Oct 20 2023 4:56 AM

- - Sakshi

రంగారెడ్డి కోర్టులు: ఇబ్రహింపట్నం ఠాణా పరిధిలో 2022లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 3వ అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి జి. భవానీ చంద్ర గురువారం తీర్పు చెప్పారు.

ఏపీపీ డి.రఘు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం పరిధిలోని చర్లపటేల్‌గూడ గ్రామంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి, అతడి స్నేహితుడు రాఘవేందర్‌ రెడ్డిలను భూ వివాదాల కారణంగా ప్రధాన నిందితులు మేరెడ్డి మట్టా రెడ్డి, మహమ్మద్‌ ఖాజా మోయినుద్దీన్‌, బుర్రి భిక్షపతితో కలిసి హత్య చేశాడు. మృతుడు శ్రీనివాస్‌ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

నిందితులను రిమాండ్‌లోనే ఉంచి కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా సాంకేతిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. ఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్లను సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారం ప్రధాన నిందితుడైన మేరెడ్డి మట్టా రెడ్డికి జీవిత ఖైదు, రూ.1,100 జరిమానా, మిగతా ఇద్దరు నిందితులైన మహమ్మద్‌ ఖాజా మోయినుద్దిన్‌, బుర్రి భిక్షపతిలకు జీవిత ఖైదు, రూ. 800 జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.

 
Advertisement
 
Advertisement