వరంగల్ స్పోర్ట్స్ : క్రమశిక్షణ నేర్పించాల్సిన పెద్దలే విచక్షణ కోల్పోయారు. క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన నిర్వాహకులే భౌతికదాడులకు తెగబడ్డారు. క్రీడా లోకానికే మచ్చతెచ్చేలా వ్యవహరించిన తీరుతో యువ క్రీడాకారులు ఆత్మ పరిశీలనలో పడ్డారు. హనుమకొండలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బాక్సింగ్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 బాలబాలికల ఎంపికలు అపహాస్యం పాలయ్యాయి.
అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎంపికలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఉదయమే బాక్సింగ్ హాల్‌కు చేరుకున్నారు. నిబంధనల మేరకు క్రీడాకారులకు ముందుగా వైద్య పరీక్షలు చేసిన అనంతరం వెయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్వాహకులు వైద్య బృందం రాకముందే క్రీడాకారుల బరువు నమోదు చేస్తున్నారు. అందులో కొందరు క్రీడాకారులు బరువు 100 నుంచి 200 గ్రాముల ఎక్కువగా ఉన్నట్లు చూపెట్టారు. దీంతో బరువు తగ్గించేందుకు అరగంట పాటు గ్రౌండ్‌లో వ్యాయామం చేసేందుకు వెళ్లారు. అనంతరం మరోసారి వెయింగ్ కోసం వచ్చిన క్రీడాకారులను సమయం ముగిసిందంటూ నిర్వాహకులు ఎంపికల్లో పాల్గొనకుండా రిజెక్ట్ చేశారు. నిబంధనల పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నిర్వాహకులు అవేమీ పట్టించుకోకకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై రెఫరీగా వ్యవహరించే కోచ్ శ్రీకాంత్, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి. రవీందర్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. సమయం పేరుతో క్రీడాకారుల భవిష్యత్‌ను నాశనం చేయడమేంటని నిలదీశాడు. ఈ క్రమంలో మాటలు కాస్త దూషించే స్థాయికి ఆ తర్వాత బాక్సింగ్ హాల్‌లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఠాణా మెట్లెక్కిన పంచాయితీ..
రెఫరీ వర్సెస్ అసోసియేషన్ అధ్యక్షుడి మధ్య జరిగిన దాడులతో క్రీడాకారులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. గొడవ ముదురుతుండడంతో అక్కడే కొందరు 100 డయల్ చేయడంతో ఇద్దరిని హనుమకొండ పీఎస్‌కు తరలించారు. కాగా, ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో క్రీడాకారుడి నుంచి రూ.300 వసూలు చేసిన నిర్వాహకులు కనీసం అరటిపండు కూడా ఇవ్వలేదని వాపోయారు.
ఉమ్మడి జిల్లా నుంచి 17 మంది హాజరు..
పంచాయితీ సమస్యను పక్కనపెట్టి సాయంత్రం 5 గంటలకు ఎంపిక ప్రక్రియ కొనసాగించినట్లు నిర్వహణ కార్యదర్శి సీ. హెచ్ రామకృష్ణ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు బాలికలు, 13 మంది బాలురు ఎంపికలకు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
బాక్సింగ్ క్రీడ ఎంపికలో భౌతిక దాడులు
నిర్వాహకుల తీరుపై అసంతృప్తి
ఠాణా మెట్లెక్కిన క్రీడల పంచాయితీ


