అంకిత భావమే విజయానికి మూలం | - | Sakshi
Sakshi News home page

అంకిత భావమే విజయానికి మూలం

Jun 10 2026 1:55 AM | Updated on Jun 10 2026 1:55 AM

హసన్‌పర్తి: కృషి, నిజాయితీ, అంకితభావమే విజయానికి మూలమని బిట్స్‌ పిలానీ గ్రూప్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌లోని ఎస్సార్‌ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాంగోపాల్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సావీనర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని చెప్పారు. జీవితాంతం నేర్చుకునే తత్వం సృజనాత్మకత, పట్టుదల, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సార్‌ యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి మాట్లాడుతూ అభిరుచి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధించొచ్చన్నారు. విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం చూపే విలువలను అందించేదని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్సార్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్య విలువల ఆధారిత అభ్యాసానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. ఈసందర్భంగా సుమారు 1,500 మంది విద్యార్థులకు డిగ్రీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కూచి పూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డికి భారతీయ కళల రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ (హానరిస్‌ కాసా) ప్రదానం చేసింది. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దీపక్‌ గార్గ్‌, ప్రో–చాన్స్‌లర్‌ ఎ.మధుకర్‌ రెడ్డి, ప్రో–వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వి.మహేశ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.వెంకట రమణారావు, డీన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ గ్రోత్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. అర్చనారెడ్డి, డైరెక్టర్‌ ఐ క్యూఏసీ ప్రొఫెసర్‌ పి.వి. రాజశేఖర్‌, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ ఎ.వి.వి. సుధాకర్‌ పాల్గొన్నారు.

ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి

ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఐఐటీ, మాజీ డైరెక్టర్‌ (ఢిల్లీ) రాంగోపాల్‌రావు అన్నారు. మంగళవారం ఎస్సార్‌ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితిల్లో నెలకొందన్నారు. కొన్నాళ్లుగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్నత విద్యలో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన వారిని వీసీలుగా నియమించాలన్నారు.

బిట్స్‌ పిలానీ గ్రూప్‌ వైస్‌ చాన్స్‌లర్‌

రాంగోపాల్‌రావు

ఘనంగా ఎస్సార్‌ స్నాతకోత్సవం

1,500 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం

Advertisement
 
Advertisement
Advertisement