● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముందస్తు పంట ప్రణాళికలు రూపొందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల క్షేత్రస్థాయి అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరి సాగుకు బదులుగా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావానికి అనుగుణంగా తక్కువ నీటితో పండించే పంటలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టే వారిని గుర్తించి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఆర్.శ్రీనివాస్‌రావు, వ్యవసాయ సంచాలకులు బి.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
ఖిలా వరంగల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాములో భద్రపరచిన ఈవీఎంలను వరంగల్ కలెక్టర్ సత్యశారద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు.
మార్కెట్ యార్డు సందర్శన
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం వరంగల్ కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా పోటెత్తిన మిర్చి యార్డును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ జనార్దన్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, డైరెక్టర్ గజ్జల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
20న జాతీయ లోక్‌అదాలత్
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 20న రెండవ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


