11, 14, 17 తేదీల్లో స్థానిక సెలవు
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 11, 14, 17వ తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయా తేదీల్లో స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు, ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
అందుబాటులో యాసంగి విత్తనాలు
వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం పంటల సరళి, విత్తనాలు, ఎరువుల లభ్యత, అమ్మకాలపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో మొదటి, రెండో విడతకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారదల సమక్షంలో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి నిర్మల పాల్గొన్నారు.
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
వరంగల్: ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు బాలమాయదేవి, కలెక్టర్ సత్యశారద అన్నారు. జీపీ ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ విధులను నిర్వర్తించి నివేదికలను సకాలంలో అందజేయాలన్నారు.
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంల) వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం తనిఖీ చేశారు.
వివరాలు నమోదు చేయాలి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్‌లోని పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


