పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11న నిర్వహించనున్న మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకుని పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, శానిటేషన్, ర్యాంపులు, లైట్లు, టెంట్ల వంటి సౌకర్యాలపై సమీక్షించి లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది నియామకం, సామగ్రి పంపిణీ, రవాణా భద్రతా చర్యల కోసం విభాగాల వారీగా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్డ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికలయ్యే వరకూ కోడ్ అమలు
ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో గ్రామపంచాయతీ, వార్డు స్థానాలకు ఎన్నికలకు జరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పూర్తిగా పాటించాలని కోరారు.


