‘వనితవనం’లో మహిళా శక్తి భవనం
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : మహిళా శక్తి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ క్షేత్రస్థాయిలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసి సమర్థవంతంగా పనులు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని వనితవనం ప్రాంతంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని, అక్కడే లోటస్ పాండ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో ప్రవహిస్తున్న నాలాను మేయర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ, సీహెచ్‌ఓ రమేశ్, ఏంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
వ్యర్థాల ఎనర్జీ ప్లాంట్ పరిశీలన
గోవాలో వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్వహణ తీరును అక్కడి సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక పద్ధతులు శక్తి ఉత్పాదిత సాంకేతికత పర్యావరణ పరిరక్షణ సంబంధిత చర్యలను కమిషనర్ పరిశీలించారు. యంత్రాల సామర్థ్యం, డిజిటల్ మానిటరింగ్ తదితర అంశాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు.


