
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో లైవ్‌లో జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులు వీక్షించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చిందన్నారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞంగా సాగునీటి ప్రాజెక్టులను మార్చిన అనుభవం ఉన్న కాంగ్రెస్ కాళేశ్వర ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసే ధైర్యం లేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో ఆయా సంస్థల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుధీర్‌కుమార్, మర్రి యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.