
ఐసీసీసీకి అనుసంధానం చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
రామన్నపేట: గ్రేటర్ పరిధి చెత్త తరలింపు వాహనాల సమాచారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)కి అనుసంధానం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వాహనాల పనితీరు తెలుసుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల వారీగా కేటాయించిన వాహనాలకు ప్రత్యేక గుర్తిపు నంబర్లను కేటాయించనున్నట్లు తెలిపారు. డీసెంట్రలైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాలను విలీన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. కాంపాక్టర్లను పునరుద్ధరించి 3 వాట్స్ సామర్థ్యంతో ఒక్కో కాంపాక్టర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్‌ఫర్ స్టేషన్లపై భారం తగ్గుతుందని సిబ్బందికి సూచించారు. జవాన్లను టీమ్‌లుగా ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్లలో వినియోగించేలా చూడాలని సీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఐటీ మేనేజర్ రమేశ్, ఐసీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలు పాటిస్తేనే అనుమతులు
నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం నగరంలోని కాకతీయ కాలనీ ఫేజ్–2, కాశిబుగ్గ, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లో కమిషనర్ భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దస్త్రాలను పరిశీలించారు. కొలతలు వేసి సమర్పించిన దస్త్రాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పైడిపల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీ రజిత, టీపీఓ ఏర్షాద్, ఇన్‌చార్జ్ ఈఈ సంతోశ్‌బాబు, డీఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.