
ఏడుబావులను చూడగలమా?
కొత్తగూడ : చుట్టూ దట్టమైన అడవి. మధ్యలో ఎత్తైన గుట్టలు. గుట్టల సమీపంలో ఆహ్లాదకర ప్రకృతి అందాల నడుమ ఏడు బావుల జలపాతం. వర్షాకాలంలో ఈ ప్రకృతి అందాలు వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చే వారు. దారి సరిగా లేకపోయినా నడుచుకుంటూ వెళ్లి ఏడుబావులను చూసి ఆనందించేవారు. అయితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండడంతో మూడేళ్లుగా ఇక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు. భద్రాద్రికొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామ సమీపంలోని పాండవుల గుట్టల్లో ఉన్న ఏడు బావుల జలపాతాన్ని ఈవర్షాకాలంలోనైనా సందర్శించే కల నెరవేరుతుందా.? అనే చర్చ సాగుతోంది.
జలపాతం విశిష్టత..
ఈ జలపాతం ఎత్తైన పాండవుల గుట్టల పైనుంచి ఏడు గుట్టలు దాటుతూ భూమిని తాకుతుంది. ఒక్కొ గుట్టపై నీరు పోసిన చోట బావి ఏర్పడింది. ఏడు చోట్ల బావులుగా ఏర్పడడం వల్ల ఏడు బావులు అనే పేరు వచ్చింది. పైనుంచి జాలు వారే నీరు ఎంత వచ్చినా 500 మీటర్ల దూరం ప్రవహించి భూమిలో ఇంకిపోతుంది. అన్ని నీళ్లు ఒకేసారి భూమిలోకి ఎలా ఇంకుతాయో అనే అంశమే ఇక్కడి విశిష్టత. దీనిని చూసి తరించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు.
ప్రమాదాలతో సందర్శన నిషేధం..
గుట్టపైకి ఎక్కి ఏడు బావుల్లో స్నానం చేసేందుకు పర్యాటకులు యత్నించి జారి పడడం, కొందరు యువకులు మద్యం మత్తులో గుట్ట ఎక్కడం వల్ల ప్రమాదాలు సంభవించాయి. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు సందర్శనను నిషేధించారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి..
అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఏడు బావులు సందర్శించేలా ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. అలాగే, ట్రెక్కింగ్‌కు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అటవీ శాఖ సిబ్బందిని నిరంతరం కాపలా ఉంచాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యాటకుల కల నెరవేరుతుందని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జలపాతం సందర్శించాలనే పర్యాటకుల కల నెరవేరేనా?
ప్రమాదాలతో జలపాతం సందర్శన నిలిపివేత
భద్రతా చర్యలు చేపట్టి ఈ వర్షాకాలంలోనైనా అనుమతించాలని
కోరుతున్న పర్యాటకులు

ఏడుబావులను చూడగలమా?

ఏడుబావులను చూడగలమా?