
మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి
ఖిలా వరంగల్/వరంగల్ చౌరస్తా: మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో చేపట్టిన వనమహోత్సవం, ఎల్బీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈసందర్భంగా వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రి సురేఖ మొక్కలు నాటి, 100 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2.41 కోట్ల వడ్డీలేని రుణాలు, 98 సంఘాలకు రూ.12.46 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు, 2,690 మంది లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ 1951లో వనహోత్సవాన్ని చేపట్టారని గుర్తుచేశారు. తల్లి పేరు మీద మొక్కనాటాలని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విజ్ఞప్తి ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎఫ్‌ఓ అనూజ్‌అగర్వాల్, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఈఓ జ్ఞానేశ్వర్, అదనపు కమిషనర్ జోనా, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ రమేశ్, హెచ్‌ఎం శారదాబాయి, కార్పొరేటర్లు మహమ్మద్ ఫుర్ఖాన్, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన, మరుపల్ల రవి, చింతాకుల అనిల్‌కుమార్, భోగి సువర్ణ, పోశాల పద్మ, మండల ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
మంత్రి కొండా సురేఖ