
స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు
హన్మకొండ: గత రెండు నెలలుగా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల నీటి వినియోగం తగ్గుతూ వస్తోంది. రుతుపవనాలకు ముందు మే నెలలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జల మట్టం 8.55 మీటర్ల లోతులో ఉండగా.. జూన్ మాసాంతానికి 8.37 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్‌లో 7.35 మీటర్ల లోతులో మాత్రమే ఉంది. ఏప్రిల్‌లో పోల్చితే మే నెలలో భూగర్భ జలమట్టం పడిపోయింది. మే నెలతో పోలిస్తే జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. వరంగల్ జిల్లాలో మే మాసాంతంలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. జూన్ మాసాంతానికి 5.98 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్‌లో సగటు భూగర్భ జలమట్టం పరిశీలిస్తే హనుమకొండ జిల్లాలో పడిపోగా.. వరంగల్ జిల్లాలో స్వల్పంగా పెరిగింది. ప్రతి నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురువక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగేకొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది.
హనుమకొండ జిల్లాలో 8.37 మీటర్లు..
వరంగల్ జిల్లాలో 5.98 మీటర్ల సగటు