
ముగిసిన ‘సకల కళల సంబురాలు’
హన్మకొండ కల్చరల్: తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో.. తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన సకల కళలు సంబురాల జాతర–25 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాల నుంచి పలు కళారంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కళాబృందాలు హాజరై ప్రదర్శనలిచ్చారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యాపారవేత్త ఆడెపు రవీందర్, జ్యూరీ, చీఫ్ కో–ఆర్డినేటర్ టీవీ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు జడల శివ, హరిత దంపతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రదానం చేశారు. కళాకారులు సకల కళలు సంబరాల జాతర కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు, ఒగ్గుకథ, బుర్రకథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. పాల్గొన్న కళాకారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం జడల శివ మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు, సహాయం అందాలన్నారు. రాష్ట్ర జానపద కళాకారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నాట్య కళాకారులు సమాఖ్య రాకం సంతోశ్, కోశాధికారి రామగిరి అర్జున్, పీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.
జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీకి తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్