
పచ్చదనమే లక్ష్యంగా..!
వరంగల్ జిల్లాలో న్యూట్రిషన్ గార్డెన్స్..
వరంగల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వన మహోత్సవంలో భాగంగా 26 ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 31,04,272 మొక్కలు నాటి వరంగల్ జిల్లాను పచ్చలహారం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 337 నర్సరీల్లో 32,02,510 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అటవీశాఖ.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ ఏర్పాటుచేసే దిశగా చర్యలు చేపట్టింది. బడుల్లో నాటిన ఔషధ మొక్కలు పిల్లలకు పోషకాహార భద్రతతోపాటు వైద్య అవసరాలు కూడా తీర్చే వీలుంది. ఈ గార్డెన్స్‌లో కలబంద, తులసి, వేప, మెంతులు, అల్లం పలు రకాల మొక్కలు నాటనున్నారు. దీంతో పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడంతోపాటు అక్కడ గడపడం వల్ల ఆరోగ్యకర వాతావరణం కల్పించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్ : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు మహా క్రతువు చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి గాను హనుమకొండ జిల్లాలో 8 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ కొనసాగుతోంది. డీఆర్‌డీఓ పరిధిలోని 12 మండలాలకు గాను 208 నర్సరీల్లో మొత్తం 14.50 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది నాటనున్న మొక్కల్లో మామిడి, జామ, నేరేడు, ఉసిరి, తులసి, గరగ, నిమ్మ వంటి పండ్ల మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలు, మినీ వనాలు ఏర్పాటు ద్వారా గ్రామీణాభివృద్ధికి పచ్చదనాన్ని చేర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. మొక్కల సంరక్షణకు సముచితమైన పద్ధతులు పాటించాలని, ప్రజల సహకారం అవసరమని డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు అందరూ కలిసి ఈ హరిత ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హరితహారానికి అధికారుల కసరత్తు
హనుమకొండ జిల్లాలో టార్గెట్ 8లక్షలు, వరంగల్ జిల్లాలో 31లక్షలు
ఈ మేరకు నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు