
నిరాదరణ బాలలకు సాథితో సేవలు
● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే
వరంగల్ లీగల్ : సమాజంలో నిరాదరణకు గురైన బాలలకు సాథితో ఆధార్, ఇతర సేవలు అందుతాయని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్ పాండే తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సాథి క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. ఈ క్యాంపెయిన్ ద్వారా జిల్లాలోని నిరాదరణకు గురైన బాలలు, అనాథలు, దివ్యాంగులు, ఇతర కారణాల వల్ల ఒంటరి పిల్లల కు ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా, ఆరోగ్య, సంరక్షణ, పునరావాస చర్యలు నేరుగా కల్పించేందుకు కావాల్సిన గుర్తింపు కార్డులు జారీకి క్యాంపుల నిర్వహణ, సర్వే చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో క్యాంపుల నిర్వహణకు వివిధ ప్రభుత్వ అధికారులు, సంస్థలు, పారా లీగల్ వలంటీర్లు, పానెల్ లాయర్స్‌తో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంజిత్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, ఎన్జీఓ ప్రతినిధులు ఎర్ర శ్రీకాంత్, కళ్యాణ్, సుజాత రెడ్డి, ప్యానెల్ అడ్వకేట్స్, పారాలీగల్ వలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.