
అధిక జనాభాతో అనర్థాలు
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: అధిక జనాభాతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. పెరుగుతున్న జనాభా అనేక అనర్థాలకు కారణం అవుతుందన్నారు. ఈ మేరకు జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనాభా నియంత్రణ లేనిచో సామాజిక వ్యత్యాసాలు వస్తాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణలో కృషిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని సన్మానించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన దంపతులకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడానికి రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఎచ్‌ఓలు ప్రకాశ్, కొమురయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.