
ముందుకు సాగని వానాకాలం
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి కానీ, ఈ సీజన్‌లో రైతులకు ఆ పరిస్థితి లేదు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చే ర క.. పెరిగిన భూగర్భజలాలూ అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే..
మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా.. ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో సాగు పెరగలేదని, ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
లోటు వర్షపాతం.. వరిసాగు 6.39 శాతం
జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్‌లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్‌లో 23, ములుగులో 32, హనుమకొండలో 30 శాతం తక్కువగా ఉంది. ఈనేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వ ర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరాని సీజన్
గత సీజన్‌లో ఇప్పటికే 74శాతం..
ఈ సారి 34.50 శాతానికే పరిమితం
సాగు అంచనా 15.83 లక్షల
ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది
5.46 లక్షల ఎకరాలు
ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం