
మాత్రా, సర్వమంగళగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని మాత్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని సర్వమంగళ అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 10న మహాశాకంబరీ అమ్మ వారి దర్శన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, వరంగల్ ఏఎస్‌పీ నాగరాలే శుభం ప్రకాశ్, మట్టెవాడ సీఐ గోపి దేవాలయాన్ని సందర్శించారు.
కూరగాయలు సమర్పించిన భక్తులు..
మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరసేవా ట్రస్ట్ సభ్యులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కూరగాయలతో ఓసిటీ నుంచి ర్యాలీగా బయలుదేరి భద్రకాళి దేవాలయానికి చేరుకుని మహాశాకంబరీ అలంకరణకు కూరగాయలు సమర్పించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ర్యాలీకి స్వాగతం పలికారు.
10న మహా శాకంబరీగా అమ్మవారి దర్శనం

మాత్రా, సర్వమంగళగా భద్రకాళి