మనసారా మొక్కులు | Sakshi
Sakshi News home page

మనసారా మొక్కులు

Published Sat, Feb 24 2024 1:42 AM

- - Sakshi

మదినిండా భక్తితో కీకారణ్యంలో కాలుమోపారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. వాగొడ్డున తలనీలాలు సమర్పించిన భక్తులు అమ్మల గద్దెల వద్దకు చేరి తన్మయత్వంతో ఊగిపోయారు. ‘జంపన్న అబ్బియో.. సారక్కా అబ్బియో.. సమ్మక్కా శరణు.. తల్లులకు పదివేల దండాలే అబ్బియో’.. అంటూ శివసత్తుల పూనకాలతో భక్తుల్లో జోష్‌ నిండుకుంది. జై సమ్మక్క.. జయహో సారలమ్మ నినాదాలతో హోరెత్తించారు. వనదేవతలకు బంగారం(బెల్లం), కానుకలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం రాత్రి భక్తులతో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం

మేడారం(ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌ తాడ్వాయి):

మేడారంలో వనదేవతలకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చెంతకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆదివాసీల ఇలవేల్పులు గద్దెలపై ఆశీనులై ఉండగా.. ‘దండుగా కదిలొచ్చి దండిగా మొక్కులు’ తీర్చుకున్నారు. మదినిండా భక్తిపారవశ్యంతో తమ కష్టాలు, కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కోరికలు తీరితే మళ్లొచ్చే జాతరలో ఎత్తు బంగారం, కానుకలు, తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. నలుదిక్కుల నుంచి తరలివచ్చిన భక్తుల దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. సమ్మక్క, సారలమ్మ నినాదాలతో జాతర ప్రాంగణం మార్మోగింది.

వాగులో స్నానాలు.. తలనీలాల సమర్పణ

తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు మొదట జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో శివసత్తులు పూనకాలతో శివాలూగారు. సైకత శివలింగాలను తయారు చేసి పూజలు చేశారు. అనంతరం అమ్మల సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించి వాటిలో కొద్దిగా గద్దెల వద్ద ముడుపు చెల్లింపుగా వేశారు. సంతానం లేని వారు రావిచెట్టు వద్ద ఊయల కట్టి వరం పట్టారు. ఈ క్రమంలో గద్దెల నుంచి బంగారం(బెల్లం), కుంకుమ, పసుపును మహాభాగ్యంగా తీసుకొని ఇళ్లకు వెళ్లారు. నాయకపోడు ఇలవేల్పు లక్ష్మీదేవర సైతం గద్దెల వద్దకు చేరుకుంది. అక్కడ నాయకపోడు వర్గం వారు మొక్కులు చెల్లించి, తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లారు. కాగా మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసిన భక్తులు తాగునీటి నల్లాలు, పంపుల వద్ద క్యూకట్టారు. ట్యాంకర్లు, నల్లాలు ఉన్నప్పటికీ తాగునీటి ఇబ్బందులు తప్పలేదు.

పలు రాష్ట్రాల నుంచి..

ఆంధ్రా, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల నుంచి గురువారం రాత్రి నుంచే భక్తుల రాక పెరిగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే గద్దెల వద్ద రద్దీ నెలకొంది. క్యూ లైన్లు నిండిపోయి భక్తులు రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో వెళ్లేలా చూశారు. రాత్రి వరకు దాదాపు కోటిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.

కానుకల చెల్లింపు..

భక్తులు వనదేవతలకు ఇష్టమైన బంగారం(బెల్లం), కానుకలు చెల్లించి మొక్కులు అప్పగించారు. ఒడి బియ్యం, పసుపు, కుంకుమ గద్దెలపైకి నిరంతరాయంగా చల్లారు. రోజంతా భక్తుల రద్దీ కొనసాగడంతో గద్దెల ప్రాంగణంలో భక్తిపారవశ్యం ఉప్పొంగింది. భక్తుల కానుకలతో నిండిన హుండీలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించారు. గద్దెలపై ఉన్న బంగారం(ప్రసాదం) తీసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు.

వస్తున్నారు.. పోతున్నారు..

జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని విడిది చేశారు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో ఆరోజు రాత్రి నుంచే మొక్కులు ఊపందుకున్నాయి. అమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తులు శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటిబాట పట్టారు. తిరుగు ప్రయాణం భక్తులతో ఆర్టీసీ బస్‌స్టేషన్‌ పాయింట్‌ కిక్కిరిసిపోయింది. వీఐపీల వాహనాలు, దర్శనాలకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు దక్కలేదు. మేడారం జాతరలో పోలీసులే కీలమైనప్పటికీ.. వారి తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎత్తు బంగారం తూకం వేస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

10

లోu

సమ్మక్క–సారలమ్మ

పోరాటం ఆదర్శం

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ,

పగిడిద్దరాజు, గోవిందరాజు

పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

దర్శించుకుని పులకించిన భక్తజనం

రోజంతా కొనసాగిన రద్దీ

నేడు వన ప్రవేశంతో

ముగియనున్న మహాజాతర

తల్లుల దర్శనం మూడోసారి

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

1/3

2/3

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement