వరుడై వెళ్లి.. ‘మరుబెల్లి’కి రావయ్యా.. | Sakshi
Sakshi News home page

వరుడై వెళ్లి.. ‘మరుబెల్లి’కి రావయ్యా..

Published Wed, Feb 21 2024 1:38 AM

పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు 
నిర్వహిస్తున్న పూజారులు - Sakshi

గంగారం/గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: : మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మంగళవారం మేడారం బాటపట్టాడు. సాయంత్రం వరకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకున్నాడు. రెండేళ్లకోసారి జరిగే జాతరకు పగిడిద్దరాజు పడిగెను పెనక వంశీయులు అటవీమార్గం గుండా తీసుకెళ్లారు. బుధవారం సాయంత్రానికి గద్దైపెకి చేరుకుంటాడు.

వరుడిగా తయారు చేసి..

పెనక వంశీయులు పగిడిద్దరాజును వరుడిగా తయారు చేసి మేడారానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా తలపతులు పెనక వెంకటేశ్వర్లు ఇంట్లో పసుపు, కుంకుమతో పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా డప్పు వాయిద్యాలతో పగిడిద్దరాజు దేవాలయానికి వెళ్లారు. ఈక్రమంలో మహిళలు నీళ్లు ఆరబోశారు. శివసత్తుల పూనకాలు, కేరింతల నడుమ దేవాలయానికి భారీగా భక్తులు చేరుకొని పసుపు, కుంకుమను ఎరుపు రంగు బట్టతో కప్పి దేవాలయంలో పెట్టారు. అనంతరం వనం (వెదురు)ను తీసుకొచ్చి పగిడిద్దరాజు (పడిగెరూపంలో)ను పెళ్లి కొడుకుగా తయారుచేశారు. గద్దైపె ప్రతిష్ఠించి మొక్కులు చెల్లించారు. అనంతరం వడ్డె కల్తి జగ్గారావు పడిగెను పట్టుకొని గ్రామం గుండా బయలుదేరారు. ఆయనతో పాటు పూజారులు సైతం తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోస్తూ ‘వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యంటూ..’ అంటూ మొక్కలు చెల్లించారు.

అడవిలో 70 కిలోమీటర్లు..

పూనుగొండ్ల గ్రామం నుంచి వడ్డెలు, పూజారులు పగిడిద్దరాజును మేడారం తీసుకెళ్తుండగా.. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల నుంచి వందల మంది భక్తులు వెంట వెళ్లారు. సమారు 70 కిలోమీటర్లు అటవీమార్గం గుండా కాలినడకన మేడారం చేరుకుంటారు. ఈ క్రమంలో కర్లపల్లి–లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో మంగళవారం రాత్రి సేదదీరి.. ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. కాగా గ్రామంలో ఉన్న గద్దైపె పగిడిద్దరాజు పడిగెను ప్రతి ష్ఠించారు. లక్ష్మీపురానికి చేరుకున్న పగిడిద్దరాజును మంత్రి ధనసరి సీతక్క దర్శించుకున్నారు. కాగా, తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి ప్ర యాణం కొనసాగిస్తారు. బుధవారం సాయంత్రం 6గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక రాజేశ్వర్‌, పురుషోత్తం, సురేందర్‌, రాహుల్‌, వీరస్వామి, వెంకటేశ్వర్లు చెప్పారు.

రెండు రోజుల తర్వాత మరుబెల్లి జాతర..

మేడారంలో సమ్మక్కతో వివాహ అనంతరం మూడు రోజులు పాటు పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. శనివారం సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు వన ప్రవేశం చేయనుండగా.. పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటాడు. వచ్చిన రెండు రోజుల తర్వాత మరుబెల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

స్వచ్ఛంద సేవ..

పూనుగొండ్ల పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు స్వచ్ఛందంగా పనిచేశారు. పగిడిద్దరాజు బయలుదేరి వెళ్లే కార్యక్రమాన్ని అధికారులు డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షించారు. అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, సీఐ రంజిత్‌ కుమార్‌, ఎస్సై పూనెం కార్తీక్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

పెళ్లికొడుకుగా మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

దేవాలయంలో భక్తిశ్రద్ధలతో

ప్రత్యేక పూజలు

కాలినడకన బయలుదేరిన వడ్డెలు, పూజారులు

గోవిందరావుపేట మండలం

లక్ష్మీపురంలో రాత్రి బస

పగిడిద్దరాజుకు స్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపాలగడ్డ నుంచి సోమవారం పగిడిద్దరాజుతో బయల్దేరిన అర్రెం వంశీయులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి–లక్ష్మీపురానికి చేరుకున్నారు. ఈమేరకు మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ లచ్చుపటేల్‌, సమ్మక్క ప్రధాన పూజారి స్వామి, తాడ్వాయి మాజీ సర్పంచ్‌ ఇర్ప సునీల్‌ దొర, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, కాంగ్రెస్‌ తాడ్వాయి మండలం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముదురుకోల్ల తిరుపతి వారికి స్వాగతం పలికారు. కాగా మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చిన పెనక వంశీయులను అర్రెం వంశీయులు కలిశారు. ఇద్దరు కలిసి పగిడిద్దరాజు ప్రతిమలతో బుధవారం మేడారానికి చేరుకుంటారు.

1/1

Advertisement
Advertisement