తల్లుల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం | Sakshi
Sakshi News home page

తల్లుల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం

Published Tue, Feb 20 2024 1:18 AM

సమ్మక్క గద్దెకు పూలమాల వేస్తున్న మంత్రి పొంగులేటి  - Sakshi

ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ దీవెనలతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం (కాంగ్రెస్‌ ప్రభుత్వం) ఏర్పడిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం తల్లులను దర్శించుకున్న అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతర కనీవినీ ఎరగని రీతిలో జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరో వైపు భక్తుల సౌకర్యార్థం సీతక్క నిత్యం జాతర పనులు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గత ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధికి రూ. 75 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 110 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు ఇంకా 2 కోట్ల మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గత ప్రభుత్వం 3 వేల ఆర్టీసీ బస్సులు నడపగా ప్రస్తుత ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవతో 6 వేల బస్సులు నడుపుతోందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జీరో టికెట్‌పై 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. జాతర నిర్వహణకు 16 వేల మంది అధికారులు పనిచేస్తున్నారన్నారు. జాతరపై అనుభవమున్న ఐదుగురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. జాతరకు అనుసంధానమయ్యే సుమారు 270 కిలో మీటర్ల మేర నూతన రహదారులు నిర్మించామన్నారు. భక్తులు అధికారులకు సహకరించి తమ మొక్కులు చెల్లించుకోవాలన్నారు.

వన దేవతలను దర్శించుకున్న మంత్రులు

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. తొలిసారి మంత్రి, ఉమ్మ డి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి హోదాలో మేడారం విచ్చేసిన మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి సీతక్క, కలెక్టర్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు మంత్రులకు పట్టు వస్త్రాలు అందజేశారు. అలాగే, డీజీపీ రవిగుప్తా తల్లులను ద ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హెలి కాప్టర్‌లో మేడారం చేరుకున్న రవిగుప్తాకు ఎస్పీ శబరీశ్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మీడియా పాయింట్‌, మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రులు

మేడారం గద్దెల సమీపంలోని మంచె(మీడియాపాయింట్‌), టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ప్రారంభించారు. అనంతరం ఆయుర్వేదిక్‌ వైద్యశాలను కూడా ప్రారంభించారు.

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వెయ్యి ఏళ్లు గుర్తుండేలా శిలాశాసనం : మంత్రి సీతక్క

సమ్మక్క, సారలమ్మ చరిత్ర వెయ్యి సంవత్సరాలు గుర్తుండేలా మేడారంలో శిలాశాసనం ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో బడ్జెట్‌లో మేడా రం సమ్మక్క, సారలమ్మకు రూ. 110 కోట్లు కేటాయించామన్నారు. తల్లిదీవెనతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కావాల్సి న సౌకర్యాలు కల్పించుకుందామన్నారు. భక్తులు స్వీయ రక్షణతో జాతరకు వచ్చి క్షేమంగా వెళ్లాలని ఆకాంక్షించారు. ఏమైనా సమస్యలుంటే మీడియా, తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా వీఐపీలు కూడా ములుగు వద్ద తమ వాహనాలను పార్కింగ్‌ చేసి ఆర్టీసీ బస్సుల్లో వస్తే ట్రాఫ్రిక్‌ సమస్య ఉండదని సూచించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్‌, ఎస్పీ శబరీశ్‌, ఈఓ రాజేంద్రం, జాతర చైర్మన్‌ లచ్చుపటేల్‌, డైరెక్టర్‌ కిశోర్‌ పాల్గొన్నారు.

అమ్మవారికి మొక్కుతున్న మంత్రి  సీతక్క
1/1

అమ్మవారికి మొక్కుతున్న మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement