పోటెత్తిన ఎర్ర బంగారం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఎర్ర బంగారం

Published Tue, Feb 20 2024 1:18 AM | Last Updated on Tue, Feb 20 2024 1:18 AM

మార్కెట్‌లో విక్రయానికి తెచ్చిన మిర్చి బస్తాలు  - Sakshi

వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు పెద్దమొత్తంలో మిర్చి పంటను తీసుకువచ్చారు. ఈనెల 16న దేశవ్యాప్త బంద్‌, 17న శనివారం యార్డు బంద్‌, 18న ఆదివారం వారాంతపు సెలవుతో మార్కెట్‌ బంద్‌ కావడంతో సోమవారం సుమారు 80వేలకు పైగా మిర్చి బస్తాలు విక్రయానికి రావడంతో ఏ యార్డు చూసిన ఎర్రబంగారమే దర్శనమిచ్చింది. మేడారం జాతర పురస్కరించుకొని బుధవారం నుంచి ఆదివారం వరకు వరుసగా ఐదురోజుల పాటు మార్కెట్‌ కమిటీ సెలవు ప్రకటించింది. ఈసీ జన్‌లో ఒకేసారి ఇంత మొత్తంలో మిర్చి విక్రయానికి రావడంతో హమాలీలు, కార్మికులు కాంటాలు పెట్టడంలో తలామునకలయ్యారు. అన్ని రకాల మిర్చి పంట రావడంతో ఘాటు భరించక కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

బస్తాలు..ధరలు..

తేజ రకం మిర్చి సుమారు 22వేల బస్తాలు రాగా కనిష్టంగా క్వింటాకు రూ.14,000లు గరిష్టంగా రూ.20,100లు, వండర్‌హాట్‌ 8వేల బస్తాలు రాగా కనిష్టంగా రూ.16,000లు గరిష్టంగా రూ.21,500, యూఎస్‌–341రకం 45వేల బస్తాలు రాగా కనిష్టంగా రూ.14,000లు, గరిష్టంగా రూ.20,500, దేశీ మి ర్చి 2వేల బస్తాలు రాగా కనిష్టంగా రూ.30,000లు, గరిష్టంగా రూ.38,500లు, తాలుకాయ 3వేలకు పైగా రాగా కనిష్టంగా రూ.5,000లు, గరిష్టంగా రూ.8,500ల వరకు ధర పలికింది. సింగిల్‌పట్టి, డీడీ, దీపిక, దేశి, సన్నాలు, 1048లాంటి రకాలు కలిపి 80వేలకు పైగా వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. కాంటాలు పూర్తయితే బస్తాల సంఖ్య పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

జాతర సెలవులు..

మేడారం సమక్క–సారలమ్మ జాతర, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, హమీల కార్మికుల విజ్ఞప్తి మేరకు 21వ తేదీ (బుధవారం) నుంచి ఆదివారం వరకు ఐదురోజులు వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ బంద్‌ ఉంటుందని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డుల్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని, ఈవిషయాన్ని వ్యాపారులు, రైతులు, దడువాయిలు, కార్మికులు గుర్తించి ఎలాంటి సరుకులను మార్కెట్‌కు తీసుకురావొద్దని కోరారు. తిరిగి సోమవారం 26వ తేదీన మార్కెట్‌ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

ఏనుమాముల మార్కెట్‌కు

80వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

ఐదు రోజులు సెలవు..

26న మార్కెట్‌ పునఃప్రారంభం

అంధకారంగా మార్కెట్‌ పరిసరాలు

మార్కెట్‌లో యార్డులు మొత్తం నిండిపోవడంతో బయట మొత్తం లాట్లుగా పెట్టారు. యార్డుల్లో తప్ప బయట లైటింగ్‌ లేకపోవడంతో తూ కాలు వేసేందుకు హమాలీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లోని యార్డుల అవరణలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంధకారంలో వరంగల్‌ మార్కెట్‌ 
యార్డుల పరిసరాలు
1/1

అంధకారంలో వరంగల్‌ మార్కెట్‌ యార్డుల పరిసరాలు

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement