స్క్రూటినీ తర్వాత బుజ్జగింపులు? | Sakshi
Sakshi News home page

స్క్రూటినీ తర్వాత బుజ్జగింపులు?

Published Sun, Nov 12 2023 1:08 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ప్రధాన పార్టీ అభ్యర్థులకు తిరుగుబాటు అభ్యర్థుల దడ పట్టుకుంది. టికెట్‌ ఆశించి భంగపడిన వారు కొందరు ఇండిపెండెంట్లుగా, మరికొందరు ఇతర పార్టీల్లో చేరి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటినుంచి పార్టీకి అండగా ఉంటున్న వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో చాలామంది ఆశావహులు రెబల్‌గా బరిలోకి దిగారు. వీరితో ఏమేరకు ప్రభావం పడుతుందని అభ్యర్థులు లెక్కలు వేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ బెడద కొంత తక్కువగా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ అభ్యర్థులకు మద్దతుగా కుటుంబసభ్యులు, అనుచరులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనుంచి అత్యధికంగా రెబల్స్‌గా పోటీలోకి దిగడం ఆ పార్టీలకు మింగుడుపడడం లేదు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన తర్వాత ఉపసంహరణలకు మరో రెండు రోజులు గడువు ఉండగా.. ఆలోగా బుజ్జగించి దారిలోకి తెచ్చుకునేందుకు ఆయా పార్టీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపే యోచనలో ఉన్నాయి.

ఓటు వివాదంలో పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి..

పాలకుర్తి నియోజకవర్గంనుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి నాలుగు నెలల కిందట రంగంలోకి దిగారు. పార్టీ అధిష్టానం కూడా ఆమెకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రచారం కూడా చేసుకుంటున్న సమయంలో ‘పౌరసత్వ’ వివాదం తలెత్తింది. దీంతో ఆమె కోడలు మామిడాల యశస్వినిరెడ్డి పేరు సూచించడంతో అధిష్టానం టికెట్‌ ప్రకటించింది. ఇదే సమయంలో యశస్విని పేరును నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవా ల్‌ చేస్తూ.. నాగర్‌కర్నూల్‌కు చెందిన కె.దేవ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో నాగార్జున సాగర్‌కు చెందిన గంజి శ్వేతారెడ్డితో మరో నామినేషన్‌ వేయించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌గా పీసీసీ నేత బండి సుధాకర్‌గౌడ్‌, జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి నామినేషన్‌లు దాఖలు చేసి అభ్యర్థిత్వం కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

వర్ధన్నపేట కాంగ్రెస్‌లో అసంతృప్తి...

రెబల్‌గా మాజీ ఎంపీ రాజయ్య...

వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన పలువురికి అధిష్టానం మొండి‘చెయ్యి’ చూపిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.. మాజీ పోలీస్‌ అధికారి కేఆర్‌ నాగరాజును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న నమిండ్ల శ్రీనివాస్‌, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, విద్యాసంస్థల అధినేత డా.జన్ను పరంజ్యోతి, సుంచు రవి తదితరులు అసంతృప్తికి గురయ్యారు. ఇదేమిటని పార్టీలో తన వాయిస్‌ను వినిపించిన పరంజ్యోతిపై సస్పెన్షన్‌ వేటు వేయగా.. సుంచు రవి కాంగ్రెస్‌ వదిలి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరిట రెబల్‌గా నామినేషన్‌ దాఖలైంది. ఆయన పేరిట ఓ ప్రొఫెసర్‌ నామినేషన్‌ వేయడం ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడింది. అభ్యర్థిత్వం ఖరారయ్యే వరకు అందరినీ కలిసిన కేఆర్‌ నాగరాజు.. ప్రస్తుతం ఒంటెద్దుపోకడలకు పోతున్నారని కొందరు నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌కు మంచి పట్టున్న నియోజకవర్గంలో తాము ఎన్నడూ లేని విధంగా నిరాదరణకు గురవుతున్నామని కేడర్‌ ఆందోళన చెందుతోంది.

ఆఖరి రోజున రంగంలోకి రెబల్స్‌.. ఎనిమిది నియోజకవర్గాల్లో దాఖలు

బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి

తిరుగుబాటు అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరణకు

ససేమిరా అంటున్న నేతలు

కోర్టు వివాదంలో పాలకుర్తి

కాంగ్రెస్‌ అభ్యర్థి.. అక్కడినుంచే

ఎక్కువగా నామినేషన్లు

వర్ధన్నపేట హస్తం పార్టీలో

అసంతృప్తి.. రెబల్‌గా

మాజీ ఎంపీ రాజయ్య

బుజ్జగింపులకు ప్రత్యేక

బృందాలు.. నామినేషన్ల పరిశీలన తర్వాత క్లారిటీ..

వరంగల్‌ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల నుంచి కూడా టికెట్‌ రాని ఆశావహులు ఇండిపెండెంట్‌, రెబల్స్‌గా నామినేషన్లు వేశారు.

డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జాటోతు రాంచంద్రునాయక్‌ కాగా, రెబల్‌ అభ్యర్థులుగా అక్కడ టికెట్‌ ఆశించిన మాలోతు నెహ్రునాయక్‌, భూపాల్‌నాయక్‌ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

పాలకుర్తి నుంచి శుక్రవారం నామినేషన్‌ వేసిన డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, అంతకుముందు వరంగల్‌ పశ్చిమ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌గా, ఏఐఎఫ్‌బీ నుంచి కూడా నామినేషన్‌ వేశారు.

వరంగల్‌ తూర్పు నుంచి బీఆర్‌ఎస్‌ రెబల్‌గా రాజనాల శ్రీహరి, కాంగ్రెస్‌, బీజేపీ టికెట్లు ఆశించిన అలీం, సిద్ధం నరేష్‌ కూడా నామినేషన్‌ వేశారు.

మహబూబాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డా.మురళీనాయక్‌ను ప్రకటించగా.. మహబూబాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు నునావత్‌ రాధ, ఇదే పార్టీకి చెందిన గూడూరు సర్పంచ్‌ నునావత్‌ రమేశ్‌ రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. బీజేపీ నుంచి భూక్యా బాలూ రమేష్‌ రెబల్‌గా ఉన్నారు.

నర్సంపేట బీజేపీ అభ్యర్థి కె.పుల్లారావు కాగా, అదే పార్టీ నుంచి గటిక అజయ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు.

పరకాల కాంగ్రెస్‌ టికెట్‌ రేవూరి ప్రకాష్‌రెడ్డికి ఇవ్వగా అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందిన ఆత్మకూరు నాయకుడు చిమ్మని దేవరాజు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

ములుగు బీజేపీ టికెట్‌ అజ్మీరా ప్రహ్లాద్‌కు ఇవ్వడంతో అక్కడ టికెట్‌ ఆశించిన సీనియర్‌ నేత కృష్ణ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

తిరుగుబాటు అభ్యర్థులతో జరిగే నష్టాన్ని ముందుగానే నివారించేందుకు పలుచోట్ల మళ్లీ సముదాయింపులు మొదలయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత నయానో భయానో రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేలా సంప్రదింపులు జరిపేందుకు సీనియర్లతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement