తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం ఉదయం పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పలుచోట్ల ఊడిపోయాయి. పోలకంపాడు నుంచి ఉండవల్లి హరిజనవాడకు వెళ్లే దారిలో గుంటూరు చానల్ దాటిన తరువాత ఇంటిపై కొత్తగా వేసిన రేకులు ఒక్కసారిగా లేచి కరకట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల తీగలకు తగిలాయి. 5 స్తంభాల పొడవున తీగలు తెగిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తీగలు తెగిపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్ అయ్యి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లేకుంటే విద్యుత్ షాక్ వల్ల పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యుత్ తీగలు తెగడంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో అక్కడ నివసించే వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డు ఈదురు గాలికి నేలకొరిగింది. కుంచనపల్లి నుంచి రేవేంద్రపాడు వెళ్లే మార్గంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు నేలకొరిగాయి. మరో రెండు రోజులు ఇదే తరహాలో ఈదురుగాలులు, వడగాలులు ఉంటాయని అధికారులు ప్రకటించారు.


