మోంథా, దిత్వా తుఫాన్‌ల ధాటికి వరి రైతులు తీవ్రంగా నష్టప
తెనాలి టౌన్: ‘రైతన్నా... మీ కోసం’ అంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారం చేయడం మినహా అన్నదాతలకు చేసిన మేలు ఏమీ లేదని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులకు కార్డులు మంజూరు చేసి పంట నమోదు చేసే వారని అన్నదాతలు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో కౌలు రైతులు అధికంగా ఉన్నారు. వీరంతా రెండు నుంచి 20 ఎకరాల వరకు కౌలు చేస్తూ ఉంటారు. ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 30 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. మోంథా తుఫాన్ కారణంగా పైరు వేసిన మొదటిలోనే పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి వచ్చే సరికి దిత్వా తుఫాన్ వచ్చింది. బలమైన గాలులతో పంట పలు చోట్ల పూర్తిగా నేలవాలింది. దీంతో కొన్నిచోట్ల పొలాల్లోనే వరి ధాన్యం నేల రాలి మొక్కలు మొలిచాయి.
ఖర్చులు భరించలేక
పంట కోయడానికి, తరలించడానికి ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో కొన్ని చోట్ల కోత కూడా కోయలేదు. వరి కోత యంత్రానికి ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.3,800 వరకు వసూలు చేస్తున్నారు. ధాన్యం పొలం నుంచి బయటకు తీసుకురావడానికి ట్రాక్టర్‌కు కనీసం రూ. వెయ్యి అడుగుతున్నారు. ఇంతచేసినా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనే వారు కనిపించడం లేదు. బస్తా రూ.1,250 నుంచి రూ.1,300 మాత్రమే దక్కుతోంది. రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.


