అంబేడ్కర్ భావజాలంతో సమస్యల పరిష్కారం
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్
ఏఎన్‌యూ (పెదకాకాని): భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ భావజాలం నేటి అనేక సంక్షోభాలకు పరిష్కార మార్గాలను చూపుతుందని ఉస్మానియా యూనివర్సిటీ పీఏసీపీఈటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ అంబేడ్కర్ చెయిర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి సభ శనివారం వర్సిటీలోని బాలమోహన్ దాస్ సెమినార్ హాల్‌లో జరిగింది. ముందుగా వర్సిటీలో ఉన్న అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. చెయిర్ ప్రొఫెసర్ ఆచార్య వై.అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి పరిష్కార మార్గాలను వెతుకుతున్నారని గుర్తు చేశారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వీరయ్య, ఆచార్య అశోక్ కుమార్‌లు మాట్లాడారు.


