విదేశీ గడ్డపై మెరిసిన మన వినీల
గుంటూరు అతివకు ‘మిసెస్ తెలుగు యూఎస్‌ఏ – 2026’ తది జాబితాలో స్థానం
ఏఎన్‌యూ (పెదకాకాని): యూఎస్‌ఏ మిసెస్ తెలుగు జాతీయ స్థాయి సౌందర్య పోటీ సంస్థ నిర్వహించిన ‘మిసెస్ తెలుగు యూఎస్‌ఏ – 2026’ పోటీల ఫైనలిస్టుల జాబితాలో మన గుంటూరు మహిళకు స్థానం లభించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలతోపాటుగా విదేశాలలో ఉంటున్న వారూ ఇందులో పాల్గొన్నారు. 22 మంది తుది పోటీలకు ఎంపిక కాగా, వారిలో గుంటూరుకు చెందిన దొప్పలపూడి వినీల కూడా ఉన్నారు. ఆమెను ప్రవాసాంధ్రులు, పుర ప్రముఖులు అభినందించారు. నరసింహరావు, అంజమ్మ దంపతులకు వినీల గుంటూరులో జన్మించారు. చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఉన్నత చదువు కోసం 2016లో అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని వివిధ అందాల పోటీలలో విజయాలు సాధించారు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని బంధువులు తదితరులు ఆకాంక్షించారు.


