6,7 తేదీల్లో తెలుగు సాహితీ మహోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగే ఈ వేడుకల ఆహ్వానపత్రికను సోమవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ‘తెలుగుభాష–సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై సదస్సు, అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు 200 మందితో జాతీయస్థాయి కవి సమ్మేళనం ఉంటాయి. 11 నంది అవార్డులు పొందిన ఎం.సైదారావుచే జుగల్‌బందీ, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందంచే ‘భువన విజయం’నాటకం ఉంటాయని తెలిపారు. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెనాలి కూచిపూడి కళాకారిణులు దాదాపు 500 మందితో మహానాట్య సమ్మేళనం, విభిన్న రంగాల్లో చేతివృత్తుల్లో కొనసాగుతున్న శ్రామిక యోధులు, కళారంగ ప్రముఖులకు చిరుసత్కారం ఉంటాయని వివరించారు. 7వ తేదీ ముగింపు సభలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరిస్తారు. ముందురోజున గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల కళాపురస్కారం, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ సత్కారాన్ని రూ.25 వేల చొప్పున నగదుతో అందజేస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు, మైత్రీ హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిశోర్‌బాబు, మొవ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సినీనటుడు బ్రహ్మానందంకు
జీవిత సాఫల్య పురస్కారం


